Justice Srikrishna Committee
-
‘డేటా రక్షణ’ ముసాయిదా సిద్ధం
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో వ్యక్తిగత సమాచార భద్రతకు అనుసరించాల్సిన విధానాలు, డేటా ప్రాసెసర్ల బాధ్యతలు, వ్యక్తుల హక్కులు, నియమాల ఉల్లంఘనకు విధించాల్సిన పెనాల్టీలు తదితర అంశాలను పొందుపరిచింది. ‘వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు – 2018’ ముసాయిదాలో సున్నితమైన వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ చేసేటపుడు సదరు వ్యక్తి నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోవాల్సిందేనని సూచించింది. శుక్రవారం ఈ కమిటీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు నివేదికను అందజేసింది. డేటా రక్షణ నిబంధనల ఉల్లంఘన జరిగితే విధించాల్సిన జరిమానా వివరాలనూ ముసాయిదాలో పొందుపరిచింది. దీని ప్రకారం.. డేటా ప్రాసెసింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 15కోట్ల జరిమానా లేదా ప్రపంచవ్యాప్తంగా డేటా సేకరణ సంస్థల టర్నోవర్‌లో 4% జరిమానా చెల్లించాల్సిందేనని పేర్కొంది. డేటా రక్షణ ఉల్లంఘనపై చర్య తీసుకోవడంలో విఫలమైతే రూ.5 కోట్ల జరిమానా లేదా డేటా సేకరణ సంస్థల టర్నోవర్‌లో 2% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ‘ఇది ఒక చారిత్రక చట్టం. దీనిపై విస్తృతమైన చర్చ జరగాలని అనుకుంటున్నాం. ప్రపంచానికే ఆదర్శంగా భారత సమాచార రక్షణ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం’ అని రవిశంకర్ చెప్పారు. -
చందా కొచర్ పాత్రపై శ్రీకృష్ణ కమిటీ విచారణ
సాక్షి, ముంబయి : ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్‌పై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ విచారణ చేపడుతోంది. రుణాల మంజూరులో నిబంధనలను ఉల్లంఘిస్తూ, క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని చందా కొచర్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. విచారణ ప్రక్రియ ప్రారంభమైందని సున్నితమైన, వివాదాస్పద అంశం కావడంతో తుది నివేదికకు కొంత సమయం పడుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. చందా కొచర్‌పై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో మే 30న ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. తుది విచారణ నివేదిక ఎప్పుడు సమర్పించాలనే దానిపై బోర్డు నిర్థిష్ట గడువును వెల్లడించలేదు. ఫోరెన్సిక్, ఈమెయిళ్ల పరిశీలన, రికార్డులు, సంబంధిత వ్యక్తుల స్టేట్మెంట్ల ఆధారంగా స్వతంత్ర విచారణ సాగుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా సంబంధిత అంశాలన్నింటిపైనా విచారణ చేపట్టి తుది నివేదికను సమర్పిస్తారని స్టాక్ ఎక్స్ఛేంజ్లకు దాఖలు చేసిన ఫైలింగ్‌లో బ్యాంక్ పేర్కొంది. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరులో ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించారని ఐసీఐసీఐ బ్యాంక్‌కు, చందా కొచర్‌కు సెబీ నోటీసులు జారీ చేసిన క్రమంలో స్వతంత్ర విచారణకు బ్యాంక్ ఆదేశించింది. వీడియోకాన్ గ్రూప్‌నకు, చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ మధ్య జరిగిన లావాదేవీలపై సెబీ సందేహం వ్యక్తం చేసింది. దీపక్ కొచర్‌కు ఆర్థిక సంబంధాలు కలిగిన వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల జారీలో క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిశీలించనున్నకేంద్ర మంత్రుల బృందం
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో గతంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర మంత్రుల బృందం పరిశీలించనుంది. ఏడుగురు మంత్రులతో కూడిన బృందానికి సారథ్యం వహిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితులు, విభజన గురించి 2010లో బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు సంబంధించి కమిటీ అప్పట్లో పలుప్రతిపాదనలు చేసింది. అయితే కేంద్రం ఇతర ప్రతిపాదనల్నిపక్కనబెట్టి తెలంగాణతో కూడిన హైదరాబాద్‌కు ఓటేసింది. కాగా తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్రలో వచ్చే వ్యతిరేకతను కమిటీ అప్పుడే హెచ్చరించింది. హైదరాబాద్‌లో ఆ ప్రాంతవాసులకున్న అనుబంధం గురించి వివరించింది. సీమాంధ్ర కొత్త రాజధానికి కేంద్రం భారీ ప్యాకేజీ ఇచ్చే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇతర అంశాల గురించి శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిశీలించనుంది.