కృత్రిమ మేధ అభివృద్ధి, సమర్థ వినియోగానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రోడ్ మ్యాప్
సమాజానికి ప్రయోజనకరంగా ఉండేలా ఏఐని వినియోగించుకోవాలి.. ఒక్కో దేశంలో ఒక్కోలా నిబంధనలు, నియంత్రణలు ఉంటే.. ఏఐ అభివృద్ధికి ఆటంకమే
కృత్రిమ మేధతో నెలకొనే పరిణామాలకు వర్క్ ఫోర్స్‌ను సిద్ధం చేయాలి
ఏఐ స్వర్ణయుగం ఇది.. డేటా ప్రాసెస్ ఖర్చు 97% దిగొచ్చిందని వెల్లడి
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ పరిజ్ఞానం అభివృద్ధి, సమర్థ వినియోగం కోసం నాలుగు సూత్రాలను అనుసరించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు. ఆ నాలుగు అంశాలలో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరుగుతున్న ఏఐ యాక్షన్ సదస్సులో ఏఐ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి రోడ్‌మ్యాప్‌ను సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలు దేశాల్లో భిన్నమైన నిబంధనలు, ఆంక్షలు ఉంటే.. ఏఐ అభివృద్ధికి ఆటంకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం డేటాను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు 97 శాతం దిగివచ్చిందని, ఇది కృత్రిమ మేధ అభివృద్ధికి అద్భుతమైన ఊతమిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు.
ఇది ఏఐ ఆవిష్కరణల స్వర్ణయుగమని, సమాజానికి ప్రయోజనకరంగా ఉండే ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో సుందర్ పిచాయ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే...
‘‘కృత్రిమ మేధ, దాని అప్లికేషన్ల గురించి నేను ఆశాజనకంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా టెక్నాలజీతో ప్రయోజనం పొందేందుకు, జీవితాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుంది. నేను భారత్‌లోని చెన్నైలో పెరిగాను. అప్పట్లో ప్రతి కొత్త టెక్నాలజీ ఇంటి వద్దకు చేరుకోవడానికి కొంత సమయం పట్టేది. అందులో రోటరీ ఫోన్ కూడా ఒకటి. దానికోసం మేం ఐదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.
కానీ తర్వాత ఆ ఫోన్ మా జీవితాలను మార్చేసింది. అప్పట్లో మా అమ్మకు చేసిన రక్త పరీక్షల ఫలితాలు తెలుసుకోవడానికి నేను నాలుగు గంటల పా టు ప్రయాణం చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు అంతదూరం వెళ్లినా.. ‘రిపోర్ట్ సిద్ధంగా లేదు. రేపు రండి’అని ఆస్పత్రివాళ్లు చెప్పేవారు. అదే ఫోన్ వచ్చాక.. కేవలం ఒక్క కాల్‌తో పని అయిపోయింది.
మన జీవితాల్లో గణనీయమైన మార్పు రాబోతోంది
సాంకేతికత చూపిన సానుకూల ప్రభావాన్ని గమనించాను. అదే నన్ను యూఎస్ వరకు నడిపించింది. గూగుల్ అనే స్టార్టప్ కంపెనీ వద్దకు చేర్చింది. ముగ్గురు గూగుల్ సహోద్యోగులు నోబెల్ అందుకోవడాన్ని, డ్రైవర్ లెస్ కారులో నా తల్లిదండ్రులను తీసుకువెళ్లడాన్ని ఆనాడు నేను ఊహించలేదు.
వీటిని సాకారం చేసినది ‘కృత్రిమ మేధ(ఏఐ)’సాంకేతికతే. దీనిలో మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. అయినా ఏఐ మన జీవితంలో గణనీయమైన మార్పులు తెస్తోంది. పర్సనల్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వచి్చనప్పటి కంటే ఈ మార్పు మరింత పెద్దదిగా, ప్రభావవంతంగా ఉండబోతోంది.
ఏడాదిన్నరలో 97 శాతం ఖర్చు తగ్గింది..
డేటాను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు గత 18 నెలల్లో ఏకంగా 97 శాతం దిగి వచ్చింది. పది లక్షల టోకెన్ల (డేటా ప్రాసెసింగ్ యూనిట్) డేటాను ప్రాసెస్ చేయడానికి అయిన ఖర్చు నాలుగు డాలర్ల (సుమారు రూ.350) నుంచి 13 సెంట్ల (రూ.11)కు దిగి వచ్చింది.
అంటే ఇంతకుముందెన్నడూ లేనంతగా మేధస్సు అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్నకొద్దీ.. ప్రపంచవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలను, అవకాశాలను, ఆర్థిక అభివృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తూనే ఉంటుంది. విజ్ఞానాన్ని, సృజనాత్మకతను, ఉత్పాదకతను పెంచుతుంది.
ఏఐలో గూగుల్ పెట్టుబడి..
ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, మార్చడానికి గూగుల్ సంస్థ దశాబ్దకాలం నుంచి ఏఐలో పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచంలోని సమాచారాన్ని నిర్వహించడంతోపాటు అందరికీ ప్రయోజనకరంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇది కీలకమని గుర్తించాం.
ఇప్పుడు జనరేటివ్ ఏఐ విప్లవానికి మార్గం వేసిన ఆవిష్కరణలను రూపొందించాం. ఏఐ కోసం ప్రత్యేకమైన ‘టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్’చిప్స్‌ను అభివృద్ధి చేశాం. టెక్స్టŠ, ఇమేజ్, వీడియో, ఆడియో, కోడ్ ఇలా అన్నిరకాల సమాచారాన్ని ప్రాసెస్ చేయగల ‘జెమిని’వంటి ఏఐ మోడళ్లను దీనితో వినియోగించుకోగలం.
ఎన్నో అంశాల్లో ప్రజలకు పూర్తి సహాయకారిగా ఉండే అప్లికేషన్లను రూపొందిస్తున్నాం. 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వినియోగిస్తున్న గూగుల్ మ్యాప్స్, సెర్చ్, ఆండ్రాయిడ్ వంటి ఏడు ఉత్పత్తులను మా కృత్రిమ మేధ ఆవిష్కరణల సాయంతో అభివృద్ధి చేశాం.
సైన్స్, ఆవిష్కరణలకు ఏఐ సాయం..
వైద్య రంగంలో కీలక ఆవిష్కరణగా ఆల్ఫాఫోల్డ్‌ను రూపొందించాం. 2021లో దానిని సైంటిఫిక్ కమ్యూనిటీకి ఉచితంగా అందుబాటులోకి తెచ్చాం. 190 దేశాలకు చెందిన 25 లక్షల మంది కంటే ఎక్కువ మంది పరిశోధకులు మలేరియా కొత్త వ్యాక్సిన్లు, కేన్సర్ చికిత్సలు, ప్లాస్టిక్‌ను అరగదీసే ఎంజైమ్‌లను రూపొందించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
ఆల్ఫాఫోల్డ్ ఆధారంగా ఏర్పాటైన ఐసోమోర్ఫిక్ ల్యాబ్స్.. ఔషధాల రూపకల్పన, చికిత్సలు విజయవంతం చేయడం కోసం మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు కొత్త ఔషధాలను కనుగొనడానికి, ఎలక్ట్రిక్ కార్ల కోసం మరింత సమర్థవంతమైన బ్యాటరీలను రూపొందించడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ సాయపడుతోంది. ఏఐ తర్వాత రాబోతున్న అతిపెద్ద మార్పు క్వాంటమ్ కంప్యూటింగ్.
ఇది ఆవిష్కరణల స్వర్ణయుగం..
ఇదొక చరిత్రాత్మక క్షణం. ఇది ఆవిష్కరణల స్వర్ణయుగానికి నాంది. కానీ దీని ఫలితాలు కచ్చితమని చెప్పలేను. అయితే ప్రతి తరం కూడా కొత్త సాంకేతికత వల్ల తర్వాతి తరం పరిస్థితి అధ్వానంగా మారుతుందని ఆందోళన చెందుతుంది. కానీ ప్రతిసారీ అందుకు విరుద్ధంగా జరుగుతూ వస్తోంది. ఏఐతో జీవితాలను మెరుగుపరచుకోవడానికి మనకు ఒక తరంలో ఒకసారే అవకాశం ఉంటుంది. అది సాధ్యం కావడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం.
సమాజానికి ఏఐతో సమకూరుతున్న ప్రయోజనాలెన్నో..
కృత్రిమ మేధతో సమాజానికి ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలు సమకూరుతున్నాయి. గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ప్రవేశపెట్టిన కొత్తలో కొన్ని భాషలే ఉన్నాయి. ఏఐ వచ్చాక ఈ ప్రయోజనం మరింత పెరిగింది. ఏఐ సాంకేతికతలను ఉపయోగించి గత ఏడాది 50కోట్ల మందికి పైగా మాట్లాడే 110కి పైగా కొత్త భాషలను గూగుల్ ట్రాన్స్‌లేట్‌కు జోడించాం.
60 ఆఫ్రికన్ భాషలు సహా గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇప్పుడు 249 భాషలకు చేరుకుంది. ఏఐతో ఆరోగ్య రంగంలో ప్రయోజనాలు ఎన్నో. ప్రమాదకరమైన కేన్సర్లకు సంబంధించిన బయోమార్కర్లను గుర్తించే అంశంలో ఏఐ సాయం తీసుకుంటున్నాం.
భారత్, థాయ్‌లాండ్‌లో స్థానిక సంస్థలతో కలసి 60లక్షల మందికి ఉచితంగా డయాబెటిక్ రెటినోపతికి ఏఐ స్క్రీనింగ్ చేశాం. ఏఐ ఆధారిత ఫ్లడ్‌హబ్‌తో 100 కంటే ఎక్కువ దేశాల్లో 70 కోట్ల మందికి వరదల సమాచారాన్ని ముందే అందించగలుగుతున్నాం. ఇలా ఏఐతో ప్రయోజనకరమైన సాంకేతికతలు ఎన్నో వచ్చాయి.
ఏఐ శక్తిని వెలికితీయడానికి ఏం చేయాలి?
కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వెలికితీసి, సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టాలి.
» మొదటిది... ఆవిష్కరణకర్తలు, వాటిని అనుసరించేవారితో ఎకోసిస్టమ్ రూపొందించాలి.
» రెండోది.. ఏఐ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ప్రధాన టెక్ కంపెనీలు సుమారు 300 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 26,025 కోట్లు) ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి.
» మూడోది.. వర్క్ ఫోర్స్‌ను సిద్ధం చేసేందుకు పెట్టుబడి పెట్టాలి, భవిష్యత్తు పరిణామాలకు వారిని సిద్ధం చేయాలి. ప్రపంచ ఆర్థిక సదస్సు నివేదిక ప్రకారం... యూరప్‌లోని ఉద్యోగాల్లో చాలా వరకు జనరేటివ్ ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొంటాయి.
»నాలుగోది.. సమాజంలో మార్పులు తీసుకురాగల కృత్రిమ మేధ అప్లికేషన్ల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలి. అందరూ ప్రయోజనం పొందేలా చూడాలి. అదే సమయంలో సమాచార కచ్చితత్వం, వాస్తవాలు, టెక్నాలజీ దురి్వనియోగంపై అప్రమత్తంగా ఉండాలి.
... ఈ నాలుగు అంశాలలో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమైనది. ఇందులో భాగంగా.. సృజనాత్మకత, ఆవిష్కరణలకు ఆటంకం కలుగకుండా చూసుకుంటూ, ఏఐతో సమస్యలను గుర్తించాలి. కొత్త చట్టాలు తేవడం కంటే.. ఇప్పుడున్న చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాలి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు నిబంధనలు, ఆంక్షలు ఉంటే ఏఐ అభివృద్ధికి ఆటంకమన్నది గుర్తుంచుకోవాలి. ఏఐ రంగంలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
Comments
Please login to add a commentAdd a comment