![ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లోకి గూగుల్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/71463687904_625x300.jpg.webp?itok=oa6NMoXi)
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లోకి గూగుల్
♦ గూగుల్ అసిస్టెంట్ ఆవిష్కరణ
♦ గూగుల్ హోమ్ ప్రొడక్ట్, అలో, డుయో, డేడ్రీమ్, ఆండ్రాయిడ్ ఎన్, ఆండ్రాయిడ్ వియర్ 2.0 కూడా..
శాన్‌ఫ్రాన్సిస్కో: దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా ‘గూగుల్ అసిస్టెంట్’ అనే కొత్త టెక్నాలజీని ఆవిష్కరించారు. అలాగే ఆయన ‘గూగుల్ హోమ్’ అనే వైస్-యాక్టివేటెడ్ ప్రొడక్ట్‌ను, ‘అలో’ మేసేజింగ్ యాప్‌ను, ‘డుయో’ వీడియో కాలింగ్ యాప్, ఇన్‌స్టాంట్ యాప్స్, మొబైల్ సాఫ్ట్‌వేర్ ‘ఆండ్రాయిడ్ ఎన్’ను , వీఆర్ ప్లాట్‌ఫామ్ ‘డేడ్రీమ్’ను, వియరబుల్ ప్లాట్‌ఫామ్ ‘ఆండ్రాయిడ్ వియర్ 2.0’ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో బుధవారం జరిగిన సంస్థ వార్షిక డెవలపర్ సమావేశంలో వీటి ఆవిష్కరణ జరిగింది.
గూగుల్ అసిస్టెంట్: గూగుల్ అసిస్టెంట్ అనేది ఒక టెక్నాలజీ. దీన్ని పలు ఉపకరణాల్లో వాడొచ్చు. ఇది మనం గూగుల్‌తో మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. అంటే మనకు అవసరమైన పనిని గూగుల్‌కు చెబితే.. అది దాన్ని చేసిపెడుతుంది. ఉదాహరణకు మనం డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు సినిమా టికెట్లను బుక్ చేసుకోవాలనుకుంటే.. ఆ అంశాన్ని గూగుల్ అసిస్టెంట్‌కు చెబితే.. టికెట్లను బుక్ చేస్తుంది. అలాగే మూవీ ప్రారంభానికి ముందు దారిలో ఏదైనా తినాలనుకుంటే.. దగ్గరిలోని రెస్టారెంట్ల వివరాలను తెలియజేస్తుంది. తర్వాత సినిమా థియేటర్‌కు ఎలా వెళ్లాలో దారి చూపిస్తుంది. ఈ విషయాలన్నింటినీ పిచాయ్ తన బ్లాగ్‌లో తెలిపారు.
గూగుల్ హోమ్: గూగుల్ హోమ్.. ఇది ఒక వైస్-యాక్టివేటెడ్ ప్రొడక్ట్. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. దీంతో ఇంట్లో పలు పనులను చేయొచ్చు. అంటే వాయిస్ కమాండ్స్ ద్వారా గదిలో పాటలను ప్లే అవుతాయి. లైట్స్‌ను ఆన్ చేసుకోవచ్చు. గూగుల్ హోమ్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని పిచాయ్ తెలిపారు.
అలో: ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్స్‌యాప్‌లకు పోటీగా గూగుల్ ఈ మెసేజింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది. మీరు మీ స్నేహితుడికి ఒక ఫోటో పంపాలనుకుంటే.. దాన్ని అప్‌లోడ్ చేస్తే.. ఈ యాప్ దానికి సరైన కొటేషన్స్‌ను చూపిస్తుంది. అలాగే ఇది మనకు ఏదైనా టెక్స్‌కు సరిపడే వీడియో లింక్స్‌ను చూపిస్తుంది.
డుయో: ఇది వీడియో కాలింగ్ యాప్. స్లో నెట్‌వర్క్‌లో కూడా నాణ్యమైన వీడియో కాలింగ్ తమ ఉద్దేశమని పిచాయ్ తెలిపారు. ఇందులో నాక్ నాక్ ఫీచర్ కూడా ఉంటుందని, దీంతో కాల్‌కు ఆన్సర్ చేయక ముందే అవతలి వారి లైవ్ వీడియో చూడొచ్చని పేర్కొన్నారు. ఈ సమ్మర్‌లోనే రెండు యాప్స్ అందుబాటులోకి తెస్తామన్నారు.
ఇన్‌స్టాంట్ యాప్స్: గూగుల్ సంస్థ తన ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఇన్‌స్టాంట్ యాప్స్ అనే మరొక ఫీచర్‌ను జతచేయనున్నది. ఇన్‌స్టాంట్ యాప్స్ అంటే వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్‌స్టాల్ చేసుకోకుండానే పనిచేస్తాయి. ఈ యాప్స్ స్మార్ట్‌ఫోన్‌కు బదులు గూగుల్ సర్వర్లలో రన్ అవుతాయి.