సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ జిల్లాలను తెలంగాణతో కలిపి రాష్ట్రాన్ని విభజించాలనే ప్రతిపాదనలను అడ్డుకునే లక్ష్యంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి సరికొత్త ఫార్ములాను తెరపైకి తెస్తున్నారు. విభజన అనంతరం తెలంగాణ ప్రాంత అభివృద్ధి మందగించకుండా జాగ్రత్త పడటం కోసం తెలంగాణలోని పది జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను కూడా కలిపి గ్రేటర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ ఆమె ఆంటోనీ కమిటీకి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. సోమవారం ఆంటోనీ కమిటీతో విడిగా సమావేశమైన శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నట్లు సమాచారం.