గాంధీనగర్ : గుజరాత్ పాటీదార్ సామాజకి వర్గం సభ్యులు.. దళిత వ్యక్తి బరాత్‌ని ఆపేందుకు ప్రయత్నించిన ఘటనలో పోలీసులు ఇరువర్గాల మీద లాఠీ చార్జ్ చేశారు. ఈ సంఘటన గుజరాత్‌లోని ఆరావళి జిల్లా ఖంబియాస్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. దళిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి వివాహం సందర్భంగా అతని కుటుంబ సభ్యులు బరాత్ నిర్వహించారు. పెళ్లి కొడుకును మంటపానికి ఊరేగింపుగా తీసుకెళ్లాలని భావించారు. దీన్ని జీర్ణించుకోలేని పాటిదార్ సామాజిక వర్గం సభ్యులు కొందరు ఊరేగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా రోడ్డుపైన భజన కార్యక్రమాన్ని నిర్వహించడమే కాక యజ్ఞం కూడా చేశారు. దాంతో వరుడు మరియు అతని పరివారమంతా ఐదారు గంటలపాటు రోడ్డు మీదనే ఉండాల్సి వచ్చింది.
దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అంతేకాక ఒకరినొకరు దూషించుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసుల మీద కూడా రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు ఇరు వర్గాల మీద లాఠీ చార్జ్ చేశారు. ఈ విషయం గురించి వరుడు బంధువులు మాట్లాడుతూ.. ‘పోలీసులు మాకు రక్షణ కల్పించలేదు. పాటీదార్ వర్గం వారు రోడ్డును ఇరువైపులా బ్లాక్ చేసి మమ్మల్ని మంటపానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని రోడ్డుమీద నుంచి పంపేయాల్సింది పోయి.. మమ్మల్ని బలవంతంగా వెనక్కి పంపించారు. దాంతో వివాహం ఆగిపోయింది. కనీసం ఇప్పుటికైనా పోలీసులు మాకు రక్షణ కల్పిస్తే.. సోమవారం నాడైనా పెళ్లి తంతు ముగిస్తామ’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment