
అతనో కామ పిశాచి: డాక్టర్
సాక్షి, రోహ్‌తక్ : జైలు గోడల మధ్య డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ నలిగిపోతున్నాడు. మానసిక సంఘర్షణతో కుంగిపోతున్నాడు. తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలీక ఒక్కోక్షణం ఊపిరి ఆగినట్లు ఫీల్ అవుతున్నాడు. నరకప్రాయంగా ఉన్న జీవితంగా గురించి నిరంతరం చింతిస్తున్నాడు. ఇవి గుర్మీత్‌ను పరీక్షించడానికి శనివారం రోహ్‌తక్ జైలుకు వెళ్లిన డాక్టర్ల బృందంలో ఒకరు చెప్పిన విషయాలు.
తన పేరును సీక్రెట్‌గా ఉంచమని కోరిన ఆ డాక్టర్.. సంచలన విషయాలను వెల్లడించారు. గుర్మీత్ ఓ కామ పిశాచని, జైలులో ఉంటున్న నాటి నుంచి సెక్స్‌కు దూరంగా ఉంటున్న ఆయన మనోవేదనకు గురౌతున్నట్లు చెప్పారు. ఆ వేదన వల్ల సాధారణ జైలు శిక్ష.. అతనికి మరణ దండనగా కనిపిస్తోందని తెలిపారు. సరిగా నిద్ర పట్టకపోవడం, ఎప్పుడూ పరధ్యానంగా ఉండటం, జైలు గోడలను చూస్తూ ఉండిపోవడం లాంటి లక్షణాలు దీన్నే సూచిస్తున్నాయని అన్నారు.
గుర్మీత్ ప్రస్తుత పరిస్థితిని చికిత్స ద్వారా నయం చేయొచ్చని చెప్పారు. ఆలస్యం అయితే అసలుకే మోసం వస్తుందని అభిప్రాయపడ్డారు. గుర్మీత్ డ్రగ్స్ తీసుకునే విషయంపై స్పష్టత లేదని తెలిపారు. 1988 తర్వాత నుంచి ఆయన మద్యం సేవించడం మానేశారని తెలిసింది. అయితే, ఆస్ట్రేలియా, తదితర దేశాల నుంచి తెప్పించుకునే సెక్స్ టానిక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను అధికంగా వినియోగించినట్లు డాక్టర్ వివరించారు.