డేరాబాబా దత్తపుత్రిక ప్రాణానికి ముప్పు..
డేరాబాబా దత్తపుత్రిక ప్రాణానికి ముప్పు..
Published Sat, Sep 9 2017 10:06 AM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM
సాక్షి, పంచకుల: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. డేరాబాబా అసాంఘిక కార్యకలాపాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆమెను మట్టుబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
ఈ సమాచారంతో హరియాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హనీప్రీత్ కోసం గాలిస్తున్నామని హరియాణ పోలీస్ అధికారి బీఎస్ సంధూ మీడియాకు తెలిపారు. ఆమెను అరెస్టు చేసి రహస్య విచారణ జరుపుతున్నట్లు వచ్చిన వార్తను ఆయన ఖండించారు. గత నెల 25న ఆమె గుర్మీత్‌ను రోహ్‌తక్ జైలులో కలిసే ప్రయత్నం చేసింది. జైలు వర్గాలు ఆమెను అనుమతించకపోవడంతో డేరా అనచురుల వాహనంలో వెళ్లిన ఆమె మళ్లీ కనిపించలేదు.
గుర్మీత్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం రోహ్‌తక్ జైలుకు తరలించే క్రమంలో హనీప్రీత్ సూచనల మేరకే డేరా అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి గుర్మీత్‌ను తప్పించేందుకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెపై లుక్‌అవుట్ జారీ చేశారు.
Advertisement