న్యూఢిల్లీ: హజ్ యాత్రికుల విమాన చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో టికెట్ ధర రూ.20 వేల నుంచి రూ.97 వేల వరకు తగ్గుతుందని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వి అన్నారు. 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలతో పోలిస్తే 18 నుంచి 49శాతం తక్కువని తెలిపారు. తాజా నిర్ణయంతో అహ్మదాబాద్, ఢిల్లీ నుంచి హజ్ యాత్రకు ప్రస్తుతం ఉన్న విమాన చార్జీ రూ.98, 750 నుంచి రూ.65,015కు, ముంబై నుంచి రూ.98,750 నుంచి రూ.57,857కు తగ్గుతుంది.
శ్రీనగర్ నుంచి టికెట్ ధర ఇది వరకు రూ.1,98,350 ఉండగా అది గరిష్టంగా దాదాపు సగం తగ్గి రూ.1,01,400కే వస్తుంది. వారణాసి నుంచి ఉన్న రూ.1,12,300గా ఉన్న టికెట్ ధర కనిష్టంగా తగ్గి రూ.92,004 అవుతుంది. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం ఉన్న టికెట్ ధర రూ.1,01600 నుంచి రూ.65,766కు దిగిరానుంది. ఈ తగ్గింపు ఎయిరిండియా, సౌదీ ఎయిర్‌లైన్స్‌తోపాటు ఫ్లైనాస్ విమానాల్లో ప్రయాణించే వారికి వర్తించనుంది. సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైనాస్ సంస్థ మన దేశంలోని 21 విమానాశ్రయాల నుంచి జెడ్డా, మదీనాలకు సర్వీసులను నడుపుతోంది. 2012 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు హజ్ యాత్ర సబ్సిడీలను నెల క్రితం ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది.
Comments
Please login to add a commentAdd a comment