న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాఫెల్ విమానాల ధర గత యూపీఏ ప్రభుత్వం అంగీకరించిన ధర కంటే 9 శాతం తక్కువని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విధంగా యూపీఏ ప్రభుత్వం డస్సాల్ట్‌తో కుదుర్చుకున్న ప్రాథమిక ధర, మేం అంగీకరించిన ధరను ఇంతకుముందే వెల్లడించాం.
ధరల పెరుగుదల, ఇతర అంశాలను పోల్చి చూసినప్పుడు యూపీఏ హయాంలో ధర కంటే మా ప్రభుత్వం నిర్ణయించిన ధర 9% తక్కువ’ అని ఆమె చెప్పారు. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలన్న డిమాండ్‌ను ఆమె తోసిపుచ్చారు. 2016లో కేంద్రం, ఫ్రెంచి ప్రభుత్వంతో డస్సాల్ట్ కంపెనీకి చెందిన 36 రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
వాస్తవాలను దాస్తున్నారు: ఏకే ఆంటోనీ
రాఫెల్ ఒప్పందం వివరాలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దాస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆరోపించారు. ‘ఈ డీల్‌పై వాస్తవాలను వెలికితీసేందుకు సంయుక్త పార్లమెంటరీ దర్యాప్తు కమిటీ వేయకుండా ప్రభుత్వం ఎందుకు ముఖం చాటేస్తోంది? జాతీయ భద్రతపై రాజీ పడి ఫ్రెంచి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు. తక్కువకే ఒప్పందం కుదిరింటే 126 బదులు 36 విమానాలను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment