
న్యూఢిల్లీ: రక్తపోటు బాధితుల్లో దాదాపు సగం మందికి తమకు ఆ సమస్య ఉన్నట్లే తెలియదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేవలం 45 శాతం మందికి మాత్రమే తమ రక్తపోటు స్థాయిపై అవగాహన ఉన్నట్లు తేలింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ), హార్వర్డ్ టీహెచ్ ఛాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హైడల్‌బర్గ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్, బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, గొట్టిన్‌జెన్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే సేకరించిన డేటా ఆధారంగా వారు ఈ అంచనాకు వచ్చారు.
ఈ సర్వే కోసం 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న 7,31,864 మందిని పరిశీలించారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ఇప్పటివరకు బీపీ పరీక్షలు చేయించుకోలేదని అధ్యయనంలో గుర్తించారు. 13 శాతం మంది మాత్రం తాము రక్తపోటుకి మందులు వాడుతున్నామని చెప్పగా.. మరో 8 శాతం మంది మాత్రం తమ బీపీ కంట్రోల్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు. ఇక 5.3 శాతం మంది మహిళలు, 10.9 శాతం మంది పురుషులు మాత్రమే తమ బీపీని నియంత్రణలో ఉంచుకుంటున్నట్లు వెల్లడించారు. రక్తపోటుపై అవగాహన ఉన్న వారు అత్యధికంగా పుదుచ్చేరిలో ఉండగా (80.5 శాతం).. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌లో (22.1 శాతం) ఉన్నారు. ఈ అధ్యయన వివరాలు పీఎల్‌వోఎస్ మెడిసన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.