
చండీగఢ్ : పంజాబ్ రాష్ట్రంలోని భటిండాకు చెందిన హరిప్రీత్ స్టైలే వేరు. అందరు కారును ముందుకు నడిపితే ఆయన వెనక్కి చూస్తూ కారును రివర్స్‌లో నడుపుతారు. అది మెల్లగా కాదు, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. తొలుత ఆయన స్టంట్ కోసమే కారును రివర్స్ నడపగా ఇప్పుడు అలవాటయింది. ముందుకు నడుపుమన్నా నడపలేరు. మెడలు వెనక్కి తిప్పి నడపడం వల్ల మెడలోని నరాలు అందుకు అనువుగా మారిపోయాయి.
ఆయన ఇప్పుడు కారును ముందుకు నడపాలంటే ఆయన మెడ నరాలు సహకరించవు. అందుకని పంజాబ్ ప్రభుత్వం ఆయన కారును రివర్స్‌లో నడిపేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. లైసెన్స్‌ను కూడా మంజూరు చేసింది. అందరిలాగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని హరిప్రీత్ మొదటి నుంచి అనుకునే వారట. ఓ రోజున ఆయన కారు చెడిపోయిందట. ఫ్రంట్ గేర్లు పట్టేశాయట. రివర్స్ గేర్ మాత్రమే పనిచేస్తుందట. రిపేర్ చేయించేందుకు డబ్బులు లేవట. అందుకని ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న భటిండాకు రివర్స్‌లోనే కారును తీసుకొచ్చారట.
అవును, కారును రివర్స్ నడపడం అనుభవం గడించినా తనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది కదా? అనుకున్నారట. అప్పటి నుంచి కారును రివర్స్‌లో నడపడం ప్రారంభించారట. 2003 సంవత్సరం నుంచి కారును రివర్స్‌లో నడుపుతున్న హరిప్రీత్ అందుకు అనుగుణంగా తన కారులో కొన్ని మార్పులు చేశారట. రివర్స్‌లో కారు మరింత సులువుగా వెళ్లేందుకు, రోడ్డు సరిగ్గా కనిపించేందుకు మార్పులు, చేర్పులు చేశారట. ఆయన తోటి వాహనాదారులను హెచ్చరించేందుకు కారుపై రివర్స్ వెళ్లే కారేనని రాసుకున్నారు. ప్రస్తుతం హరిప్రీత్ కారు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment