
ఆ బీచ్‌లో ఆత్మలు ఉన్నాయా..?
అనగనగా ఓ బీచ్.. చుట్టూ చిమ్మచీకట్లు.. హోరున శబ్దం చేసే అలలు.. చీకటికే భీతి గొలిపించే నల్లని సముద్రపు ఇసుక.. చిత్రవిచిత్రంగా వీచే పిల్లగాలులు.. చెవి దగ్గరకొచ్చి ఎవరో ఏదో చెబుతున్నట్టుగా వినీవినిపించని మాటలు.. అంతలోనే ఒళ్లు గగుర్పొడిచేలా బిగ్గరగా ఓ నవ్వు.. దూరంగా ఎవరితోనో కొట్లాటకు దిగినట్టుగా కుక్కల అరుపులు.. చుట్టూ చూస్తే ఎవరూ కనిపించని మాయాజాలం.. ఇవి చాలవూ ఓ మనిషి బిక్కచచ్చిపోవడానికి..?
గుజరాత్‌లోని సూరత్‌కు 19 కిలోమీటర్ల దూరాన ఉన్న డ్యూమస్ బీచ్ గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు పర్యాటకులు. ఇక్కడ ఆత్మలు ఉన్నాయని, అవి రాత్రి పూట బీచ్ ఒడ్డున సంచరించే వారికి హాని తలపెడతాయనేది ప్రధానంగా వినిపించే మాట. సాయంత్రం అయితే చాలు. స్థానికులు ఈ బీచ్ వైపు రావడానికి అస్సలు ఇష్టపడరు. పైగా ఎవరైనా డ్యూమస్ వైపు వెళ్తామనగానే అడ్డుపడతారు. అటువైపు వెళ్లొద్దంటూ సలహాలిస్తారు. నిజంగా ఈ బీచ్‌లో అంతగా భయపెట్టే అంశమేంటి..?
నల్లని ఇసుక..
నిజానికి డ్యూమస్ బీచ్ ఒకటి కాదు.. నాలుగు బీచ్‌లను కలిపి డ్యూమస్ బీచ్‌గా పిలుస్తారు. వీటిలో రెండు పర్యాటకులకు బాగా తెలిసినవే. మూడో బీచ్‌ను కొద్దిమంది మాత్రమే సందర్శిస్తారు. ఇక, నాలుగో బీచ్‌లో జనసంచారం గురించి మాట్లాడుకోకపోవడమే మేలు. దేశంలోని ఏ బీచ్‌లోనూ కనిపించని విధంగా ఈ బీచ్‌లో నల్లని ఇసుక దర్శనమిస్తుంది. దీనికి స్థానికులు చెప్పే వివరణ.. స్మశానం! అవును, ఒకప్పుడు డ్యూమస్ బీచ్‌లో ఓ హిందూ స్మశానం ఉండేది. వేలాది హిందువులను అక్కడే ఖననం చేసేవారు. అలా ఏర్పడిన బూడిద.. సముద్రపు ఇసుకతో కలిసి నల్లగా తయారైందని చెబుతారు స్థానికులు.
ఆత్మల సంచారం..
హిందూ మత విశ్వాసాల ప్రకారం మరణించినవారు సంతృప్తి చెందకపోతే వారి ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. అలా వేలాది ఆత్మలు ఈ బీచ్‌లో సంచరిస్తున్నాయని చాలామంది నమ్మకం. రాత్రి వేళల్లో బీచ్ ఒడ్డున తిరిగేవారికి ఈ ఆత్మల గొంతు వినిపిస్తుందని, కొన్ని ఆత్మలు అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నట్టుగా చిత్రవిచిత్రంగా అరుస్తాయని గ్రామస్థులు చెబుతారు. కొన్నిసార్లు ఉన్నట్టుండి బిగ్గరగా ఎవరో నవ్వుతున్నట్టుగా అనిపిస్తుందని, కానీ చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించరని కొందరు పర్యాటకులు చెబుతారు. సాధారణంగానే అత్యంత నల్లని డ్యూమస్ బీచ్.. చీకటి పడుతున్న కొద్దీ జడల మర్రిలా మరింత భయంకర రూపాన్ని సంతరించుకుంటుంది. పర్యాటకులు, స్థానికులు భయపడేందుకు ఇదీ ఓ కారణం కావొచ్చు.
విచిత్ర ప్రవర్తన..
డ్యూమస్ బీచ్ గురించి చాలామంది పర్యాటకులు చెప్పేది ఇక్కడి విచిత్రమైన వాతావరణమే. సాధారణంగా కుక్కలు ఈ బీచ్‌కు రాగానే అదే పనిగా అరుస్తూ ఉంటాయట. ఎవరినో చూస్తున్నట్టు, వారితో గొడవ పడుతున్నట్టు కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తాయట. పెంపుడు కుక్కలదీ ఇదే పరిస్థితి. ఈ కుక్కల యజమానులు వాటిని నియంత్రించడానికి నానా తంటాలూ పడతారట ఈ బీచ్‌లో. ఇవి కాకుండా.. పర్యాటకుల శరీరాలను ఏవో గాలులు తాకుతున్నట్టూ, వారిని ముందుకు వెళ్లవద్దనట్టుగా అడ్డుకుంటున్నట్టూ అనుభూతి కలుగుతుందట.
మిస్సింగ్...?
స్థానికుల మాటలు పెడచెవిన పెట్టి, రాత్రి పూట బీచ్‌ను సందర్శించిన కొందరు పర్యాటకులు ఇప్పటికీ కనిపించకుండా పోయారనే ఓ పుకారు సమీప గ్రామాల్లో వినిపిస్తూ ఉంటుంది. గతంలో కొందరు స్థానికులు కూడా బీచ్‌కు వెళ్లి తిరిగిరాలేదట.
భయపెట్టే హవేలి..
ఈ బీచ్‌లో మరింత భయపెట్టే కథలు హవేలి విషయంలో వినిపిస్తాయి. నవాబు సిది ఇబ్రహీం ఖాన్ కట్టించిన ఈ ప్యాలెస్‌లో ప్రస్తుతం మనుషులెవరూ నివసించడం లేదు. ఈ హవేలీ బాల్కనీలో ఎవరో నిల్చున్నట్టుగా కనిపిస్తుందట. దగ్గరగా వెళ్లి చూస్తే ఆ ఆకారం మాయమవుతుందట. అందుకే స్థానికులు సైతం హవేలిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇక, పర్యాటకులను ఇందులోకి చాలా ఏళ్ల కిందటి నుంచే అనుమతించడం లేదు.
అంతా భూటకం..
ఈ మొత్తం కథనాన్ని భూటకమని కొట్టి పారేసేవారూ ఉన్నారు. చాలామంది మొండిగా ఈ బీచ్‌లో రాత్రిపూట బస చేశారు. కానీ, వారు ఇక్కడ ప్రచారంలో ఉన్నట్టుగా.. తమకు ఎలాంటి అసహజ అనుభవాలూ ఎదురుకాలేదని చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం మొదలుపెట్టారని, నిజానికి డ్యూమస్‌లో అంతటి భయానక వాతావరణం ఏమీ ఉండదని చెబుతున్నారు. అయితే, కొంతమంది తమ కెమెరాల్లో బంధించిన కొన్ని దృశ్యాలు ఆత్మలు ఉన్నాయనడానికి బలం చేకూర్చుతున్నాయి. అదే సమయంలో అవి ఫ్లాష్ లోపాల వల్ల ఏర్పడిన ఇల్యూజన్ అనేవారూ లేకపోలేదు. మొత్తానికి ఇక్కడ ఆత్మలు ఉన్నాయా.. లేదా అన్నది పక్కన బెడితే, ప్రస్తుతం దేశంలోని డిమాండ్ ఉన్న బీచ్‌ల్లో ఇదీ ఒకటిగా మారిపోయింది. ఆత్మలా మజాకానా..!
- (సాక్షి స్కూల్ ఎడిషన్)