కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో కర్ణాటక సీఎం కుమారస్వామి (ఫైల్‌ఫోటో)
సాక్షి, బెంగళూర్ : తాను కర్ణాటక ప్రజలకు కాకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉంటానని వ్యాఖ్యానించి రాజకీయ దుమారం రేపిన సీఎం కుమారస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాహుల్ గాంధీ ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చానని, ప్రజల ఆశీస్సులతో కాదని అన్నారు. రైతు రుణాల మాఫీపై జేడీఎస్ ఇచ్చిన హామీకి సంబంధించి బుధవారం కుమారస్వామి రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ ఆమోదం అవసరమని ఆయన తేల్చిచెప్పారు.
తాను ప్రజల ఆశీస్సులతో కాకుండా రాహుల్ ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చానని..తాను కాంగ్రెస్ పార్టీని ఒప్పించాలని, వారి ఆమోదం లభించాకే తాను ఓ నిర్ణయం తీసుకుంటా’నని కుమారస్వామి పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున రైతు రుణాల మాఫీపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని, దీనికి తనకు కొంత సమయం కావాలని కుమారస్వామి పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.
కర్ణాటకలో ప్రజల మద్దతు తమకు లభించకపోవడంతోనే కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ మూడవ స్ధానంలో నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ బేషరతు మద్దతుతో కర్ణాటకలో కుమారస్వామి సీఎంగా జేడీ(ఎస్)- కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ కొలువుతీరింది.
Comments
Please login to add a commentAdd a comment