5 పైసల కోసం... 40ఏళ్లుగా పోరాటం
న్యూఢిల్లీ : ఐదు పైసల కాయిన్ కనుమరుగై దాదాపు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు ఆ నాణెం ఎలా ఉంటది అని అడిగితే చాలా మందికి తెలియదు కూడా. కానీ 73 ఏళ్ల రణవీర్ సింగ్ యాదవ్ మాత్రం ఈ ఐదు పైసల నాణెంపై గత 40 ఏళ్లుగా కోర్టులో పోరాటం చేస్తున్నాడు. ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ వేసిన పిటిషన్ పై సుదీర్ఘంగా పోరాడుతున్నాడు. ఇందుకోసం అతడికి లక్షల్లో కోర్టు ఖర్చులు అయినా ఈ పోరాటం ఆగలేదు. అసలు ఐదు పైసల కాయిన్ ఏమిటి? దానిపై పోరాటం ఏమిటి? అనుకుంటున్నారా.. అయితే మీరే చదవండి ఈ స్టోరీని.
రణవీర్ సింగ్ యాదవ్ 1973లో ఢిల్లీ ట్రాన్స్ పోర్టు(డీటీసీ) బస్ లో కండక్టర్ గా పని చేసేవాడు. ఆ బస్సులో ఓ మహిళ ప్రయాణికురాలు దగ్గర టిక్కెట్టు కింద 10 పైసలకు బదులు 15 పైసలు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అదనంగా 5 పైసలు అతని జేబులోకి వచ్చాయని నిందను ఎదుర్కొన్నాడు. ఈ ఆరోపణలతో చెకింగ్ స్టాప్ బస్సులోకి ఎక్కి యాదవ్ పై ఇంటర్నల్ విచారణ చేపట్టారు.
దీంతో 1976 నుంచి అతను ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తున్నాడు. 1990లో కార్మికుల న్యాయస్థానంలో యాదవ్ ఈ కేసు గెలిచినప్పటికీ, మళ్లీ తర్వాత ఏడాదిలో ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ అతనిపై కేసును తిరగదోడింది. ఇప్పటి వరకూ ఈ కేసుపై పోరాటానికి యాదవ్ చాలావరకూ ఖర్చు పెట్టాడు.
"ఒకవేళ నేను తప్పుచేసి ఉంటే నా పిల్లలే నన్ను అడిగేవారు. నాకు ఇద్దరు కుమారులున్నారు. నేను తప్పు చేయలేదు కాబట్టి నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకా కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నాను'' అని యాదవ్ చెప్పారు. అయితే డీటీసీ వేసిన ఈ పిటిషన్ ను ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తోసిపుచ్చింది. యాదవ్ కు రూ.30వేలు నష్టపరిహారంగా రవాణా సంస్థ చెల్లించాలని తీర్పునిచ్చింది. అతని పారితోషికం రూ.1.28 లక్షలు, సీపీఎఫ్ రూ.1.37 లక్షలు వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఈ 5 పైసల రికవరీ కోసం ఇప్పటివరకూ ఎన్ని లక్షలు ఖర్చు చేశారని డీటీసీని కోర్టు ప్రశ్నించింది. 40 ఏళ్లుగా డీటీసీ ఆరోపణలపై అతను పోరాటం చేస్తున్నాడని, కార్మికుల న్యాయస్థానంలో, హైకోర్టులో అతను కేసును గెలిచినా.. తగిన ఫలితాన్ని అతనికి దక్కకుండా చేశారని డీటీసీపై కోర్టు మండిపడింది. అయితే ఈ పోరాటం ఇంకా పూర్తికాలేదు. మే 26న కార్కార్డోమా కోర్టులో యాదవ్ తుది విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసు 5 పైసలకు లేదా 2 పైసలకు సంబంధించినదైనా, తమకు వేసిన జరిమానా విధింపు లక్షలతో సమానమని యాదవ్ భార్య విమల తెలిపింది.