
బీజింగ్ : చైనాను వణికిస్తున్న డెడ్లీ వైరస్ కరోనాతో ఇప్పటి వరకూ 170 మంది మరణించారు. 6000 కరోనా కేసులను ఇప్పటివరకూ నిర్ధారించినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తితో కలకలం రేగడంతో చైనా నుంచి తమ దేశీయులను వెనక్కి రప్పించేందుకు భారత్ సహా పలు దేశాలు చర్యలు చేపట్టాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్ సహా పలు ఎయిర్‌లైన్‌లు చైనా నుంచి విమాన రాకపోకలను రద్దుచేశాయి. కరోనా వైరస్ బయటపడిన వుహన్ నగరం నుంచి తమ పౌరులను ఆయా దేశాలు వెనక్కిరప్పిస్తున్నాయి. వుహన్ నగరం నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించేందుకు చైనాలో భారత్ రాయబార కార్యాలయం సన్నాహాలు చేపట్టింది.
అమెరికా, జపాన్, బ్రిటన్‌లు ఇప్పటికే తమ పౌరులను స్వదేశాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను పంపగా, యూరప్, జర్మనీ, మంగోలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ర్టేలియాలూ విమానాలను పంపుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. మరోవైపు భారత్‌లోనూ కేరళ, గుజరాత్, ఢిల్లీలోనూ పలు కేసులను గుర్తించినా ఏ ఒక్క కేసూ పాజిటివ్‌గా నమోదు కాలేదు. అనుమానిత రోగుల శాంపిల్స్‌ను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎయిర్‌పోర్ట్స్, ఆస్పత్రుల్లో ఏర్పాట్లను వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment