బీజింగ్: చైనాలో కరోనా కేసులు ఆందోళనకరస్థాయిలో పెరిగిన కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. చైనా నుంచి వచ్చే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి నిబంధన తీసుకొచ్చాయి. అయితే ఈ విషయంపై చైనా తీవ్రంగా స్పందించింది. తమ దేశం నుంచి వచ్చినవారికే పరీక్షలు నిర్వహించడం వివక్షపూరితమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్లుగా కరోనా నియంత్రణకు తాము చేపట్టిన చర్యలను నిర్వీర్యం చేసినట్లేనని వ్యాఖ్యానించింది.
అమెరికా, దక్షిణ కొరియా, ఇటలీ, జపాన్, తైవాన్ సహా భారత్ కూడా చైనా ప్రయాణికులపై ఇటీవలే ఆంక్షలు విధించింది. చైనా నుంచి వచ్చేవారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రభుత్వ మీడియా స్పందించింది.
అయితే చైనా వ్యాఖ్యలు చూస్తుంటే వింతగా అన్పిస్తోంది. మొన్నటివరకు ప్రపంచంలో ఏ దేశమూ చేయని విధంగా మూడేళ్లపాటు కఠిన కరోనా ఆంక్షలు అమలు చేసింది. విదేశాల నుంచి వెళ్లేవారు కచ్చితంగా క్వారంటైన్లో ఉండి, కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే అనుమతించింది. ఈనెల మొదట్లోనే ఆంక్షలు సడలించింది. జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధన ఎత్తివేస్తున్నట్లు చెప్పింది. కానీ.. కరోనా పరీక్షమాత్రం తప్పనిసరి చేసింది.
అలాంటి చైనా ఇప్పుడు వేరే దేశాలు ఆంక్షలు అమలు చేస్తే మాత్రం వివక్షపూరితం అనడం హాస్యాస్పదంగా ఉంది. డిసెంబర్ 7 నుంచి చైనాలో జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేశారు. ఆ తర్వాత నుంచి కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. చైనా మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తోంది.
చదవండి: సమాచారం దాచి.. సంక్షోభం పెంచి
Comments
Please login to add a commentAdd a comment