డిప్యూటీ సీఎం కొడుకుని ఫ్లయిట్‌ ఎక్కనివ్వలేదు | Heavily Drunk son of gujarat deputy chief minister taken off flight | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం తనయుడికి ఊహించని షాక్‌!

Published Tue, May 9 2017 9:28 AM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

డిప్యూటీ సీఎం కొడుకుని ఫ్లయిట్‌ ఎక్కనివ్వలేదు - Sakshi

డిప్యూటీ సీఎం కొడుకుని ఫ్లయిట్‌ ఎక్కనివ్వలేదు

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ డిప్యూటీ సీఎం తనయుడు జైమిన్‌ పటేల్‌కు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఊహించని విధంగా షాక్‌ ఇచ్చింది. ఫుల్‌గా మద్యం సేవించి విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆయనను విమానంలో ఎక్కించుకునేందుకు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ నిరాకరించింది. దాంతో వెకేషన్‌ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన జైమిన్‌ కుటుంబం అర్థాంతంగా తమ ట్రిప్‌ రద్దు చేసుకుని, ఇంటిముఖం పట్టింది.  అయితే ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ తన కొడుకునే వెనకేసుకు వచ్చారు. పైపెచ్చు తన కుమారుడి తప్పేమీ లేదని, ఎయిర్‌వేస్‌ సిబ్బందే అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

వివరాల్లోకి వెళితే... గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ కుమారుడు, వ్యాపారవేత్త జైమిన్‌ పటేల్‌ కుటుంబంతో కలిసి సమ్మర్‌ వెకేషన్‌కు గ్రీస్‌ వెళ్లేందుకు సోమవారం అహ్మదాబాద్‌ విమానాశ్రయం చేరుకున్నారు. అయితే విమానం ఎక్కేందుకు వచ్చిన జైమాన్‌ అతిగా మద్యం సేవించి ఉండటంతో బోర్డింగ్‌ వద్దే ఆయన్ని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది నిలిపివేశారు. తమకు సహకరించాలని ఆయన్ని సిబ్బంది కోరినప్పటికీ  జైమిన్‌ వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో వారు జైమిన్‌ కుటుంబాన్ని విమానంలోకి ఎక్కించుకునేందుకు తిరస్కరించారు. కాగా మద్యం సేవించిన జైమిన్‌ పటేల్‌ కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని, దీంతో ఆయన్ని వీల్‌ ఛైర్‌లో తీసుకు వచ్చినట్లు విమాన సిబ్బంది వెల్లడించారు. అలాగే ఇమ్మిగ్రేషన్‌, ఇతర చెకింగ్స్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడుతూ తమను డీఫేమ్‌ చేయడానికే ఇలాంటి ఆరోపణలు వెలువడ్డాయన్నారు. తన కుమారుడు, కోడలు, మనమరాలు వెకేషన్‌కు వెళుతున్నారని, తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని, తెలిపారు. దీంతో వారు టూర్‌ వెళ్లకుండానే వెనుదిరిగి ఇంటికి వచ్చేశారన్నారు. అయితే  తమను అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రపన్ని అవాస్తవాలు, పుకార్లకు తెరలేపారని నితిన్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement