Qatar Airways flight
-
ఖతార్ ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం ఉదయం అత్యవసరంగా ల్యాండ్ అయింది. దోహా నుంచి బాలీ వెళ్లాల్సిన ఈ విమానం కో పైలట్ టీనూ ఆమ్రేకు అస్వస్థతకు గురి కావడంతో దారి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం అస్వస్థతకు గురైన కో పైలట్‌ను విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం టీనూ ఆమ్రేను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు సమాచారం. కో పైలట్ యూరప్‌లోని రోమని దేశస్తుడని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. కాగా ఖతార్ విమానంలో 277 మంది ప్రయాణికులు ఉన్నారు. -
డిప్యూటీ సీఎం కొడుకుని ఫ్లయిట్ ఎక్కనివ్వలేదు
-
డిప్యూటీ సీఎం కొడుకుని ఫ్లయిట్ ఎక్కనివ్వలేదు
అహ్మదాబాద్ : గుజరాత్ డిప్యూటీ సీఎం తనయుడు జైమిన్ పటేల్‌కు ఖతార్ ఎయిర్వేస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఫుల్‌గా మద్యం సేవించి విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆయనను విమానంలో ఎక్కించుకునేందుకు ఖతార్ ఎయిర్వేస్ నిరాకరించింది. దాంతో వెకేషన్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన జైమిన్ కుటుంబం అర్థాంతంగా తమ ట్రిప్ రద్దు చేసుకుని, ఇంటిముఖం పట్టింది. అయితే ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తన కొడుకునే వెనకేసుకు వచ్చారు. పైపెచ్చు తన కుమారుడి తప్పేమీ లేదని, ఎయిర్వేస్ సిబ్బందే అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. వివరాల్లోకి వెళితే... గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కుమారుడు, వ్యాపారవేత్త జైమిన్ పటేల్ కుటుంబంతో కలిసి సమ్మర్ వెకేషన్‌కు గ్రీస్ వెళ్లేందుకు సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అయితే విమానం ఎక్కేందుకు వచ్చిన జైమాన్ అతిగా మద్యం సేవించి ఉండటంతో బోర్డింగ్ వద్దే ఆయన్ని ఖతార్ ఎయిర్వేస్ సిబ్బంది నిలిపివేశారు. తమకు సహకరించాలని ఆయన్ని సిబ్బంది కోరినప్పటికీ జైమిన్ వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో వారు జైమిన్ కుటుంబాన్ని విమానంలోకి ఎక్కించుకునేందుకు తిరస్కరించారు. కాగా మద్యం సేవించిన జైమిన్ పటేల్ కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని, దీంతో ఆయన్ని వీల్ ఛైర్లో తీసుకు వచ్చినట్లు విమాన సిబ్బంది వెల్లడించారు. అలాగే ఇమ్మిగ్రేషన్, ఇతర చెకింగ్స్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ తమను డీఫేమ్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు వెలువడ్డాయన్నారు. తన కుమారుడు, కోడలు, మనమరాలు వెకేషన్‌కు వెళుతున్నారని, తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని, తెలిపారు. దీంతో వారు టూర్ వెళ్లకుండానే వెనుదిరిగి ఇంటికి వచ్చేశారన్నారు. అయితే తమను అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రపన్ని అవాస్తవాలు, పుకార్లకు తెరలేపారని నితిన్ పటేల్ వ్యాఖ్యానించారు. -
బాలుడికి అస్వస్థత: విమానం ల్యాండింగ్
శంషాబాద్, న్యూస్‌లైన్: ఓ బాలుడు తీవ్ర అస్వస్థతకు గరికావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం దోహా నుంచి ఆస్ట్రేలియా వెళుతున్న ఖతార్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 380 విమానంలో ప్రయాణం చేస్తున్న ఏడేళ్ల బాలుడికి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పెలైట్ వెంటనే చెన్నై ఏటీసీని సంప్రదించినా అక్కడ ల్యాండ్ చేయడానికి వీలు కాలేదు. దీంతో శంషాబాద్ ఏటీసీ అధికారుల అనుమతితో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు విమానాన్ని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. బాలుణ్ని చికిత్స నిమిత్తం విమానాశ్రయంలోని అపోలో ఆస్పత్రికి తరలిం చారు. మళ్లీ తెల్లవారుజామున 4.30 గంటలకు విమానం ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. -
శంషాబాద్‌లో ఖతార్ విమానం దింపివేత
ఖతర్ నుంచి గోవా వెళ్లాల్సిన విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో గోవా వెళ్లకుండా అప్పటికప్పుడే శంషాబాద్‌లో దించేయాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో విమానాలలో తరచు సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. మలేషియా నుంచి బెంగళూరు రావాల్సిన ఓ విమానంలో ఇలాగే టైరు పేలిపోవడం, ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో దాన్ని అత్యవసరంగా కౌలాలంపూర్‌లో ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు గల్ఫ్‌లోని ఖతార్ నుంచి వస్తున్న విమానం గోవా వెళ్లాల్సి ఉండగా అది హైదరాబాద్‌లోనే నిలిచిపోయింది. -
చెన్నైలో దిగిన ఖతార్ ఎయిర్వేస్ విమానం
దోహాకు చెందిన ఖతార్ ఎయిర్వేస్ విమానమొకటి చెన్నైలో బుధవారం అర్థరాత్రి అత్యవసరంగా కిందికి దిగింది. ఓ మహిళా ప్రయాణికురాలికి ఛాతిలో నొప్పి రావడంతో విమానాన్ని కిందకు దించారు. మలేసియాకు వెళుతున్న విమానంలో మహిళకు అత్యవసరంగా వైద్య సహాయం అవరసరం కావడంతో పైలట్‌ను సంప్రదించాడని చెన్నై విమానశ్రయ అధికారులు తెలిపారు. అనుమతి లభించిన తర్వాత పైలట్ విమానాన్ని వెంటనే కిందికి దించాడని వెల్లడించారు. విమానం కిందకు దిగేటప్పటికి అంబులెన్స్, వైద్య సహాయక బృందాన్ని సిద్ధంగా ఉంచారు. ప్రాథమిక పరీక్ష తర్వాత మహిళా ప్రయాణికురాలిని ఆస్పత్రికి తరలించారు. తర్వాత విమానం ఇక్కడి నుంచి బయలుదేరిందని అధికారులు తెలిపారు.