హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం ఉదయం అత్యవసరంగా ల్యాండ్ అయింది. దోహా నుంచి బాలీ వెళ్లాల్సిన ఈ విమానం కో పైలట్ టీనూ ఆమ్రేకు అస్వస్థతకు గురి కావడంతో దారి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం అస్వస్థతకు గురైన కో పైలట్‌ను విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించారు.
అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం టీనూ ఆమ్రేను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు సమాచారం. కో పైలట్ యూరప్‌లోని రోమని దేశస్తుడని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. కాగా ఖతార్ విమానంలో 277 మంది ప్రయాణికులు ఉన్నారు.