సాక్షి, శబరిమల : కేరళలో ఓక్కి తుపాను విజృంభిస్తోంది. శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన వేలాదిమంది భక్తులు ఓక్కి తుపాను ధాటికి విలవిల్లాడుతున్నారు. తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉండడంతో భక్తులను అడవి మార్గం గుండా ప్రయాణించవద్దని ట్రావెన్‌కోర్ బోర్డు ప్రకటించింది. ముఖ్యంగా ఎరుమేలి-పంబా, సథరం-పులిమేడు మార్గాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని టీడీబీ పేర్కొంది. సన్నిధానం చుట్టూ ఉన్న ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో పెనుగాలులు వీస్తున్నాయని, అలాగే వర్షం కూడా కురుస్తోందని అధికారులు తెలిపారు. పంబానది కూడా ఉధృతంగా ప్రవహిస్తోందని.. భక్తులెవరూ నదిలోకి దిగి స్నానాలు చేయవద్దని అధికారులు ఆదేశించారు. అలాగే.. భక్తులు ఓకి తుపాను తగ్గే వరకూ రక్షణ ప్రాంతంలో ఉండాలని టీడీబీ పేర్కొంది.
ఇదిలా ఉండగా ఎరుమేలి-కరిమల-సన్నిధానం మార్గం అత్యంత ప్రమాదకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో గాలుల ధాటికి పెద్దపెద్ద వృక్షాలు కూలిపోయాయని వారు అంటున్నారు. పంబదగ్గరున్న త్రివేణి పార్కింగ్ ప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. ఇక్కడ పార్కింగ్‌లో ఉన్న వాహనాలు సైతం నీటిలో పూర్తిగా మునిగిపోయాయి.
ప్రస్తుతం శబరిమలకు రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. అలాగే శబరిమల ప్రాంతంలోని నదులు, నీటి ప్రవాహాలకు, విద్యుత్ స్థంభాలకు, చెట్లకు భక్తులు దూరంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఇతర సూచనలు
- సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ భక్తులు యాత్ర సాగించరాదు
- పంబనుంచి సన్నిధానం వరకూ నడిచే సమయంలో విద్యుత్, చెట్లకూ దూరంగా ఉండాలి.
- తుపాను దృష్ట్యా ఎరేమేలి-పంబా నడకదారి నిషేధం
- సన్నిధానం, పంబల్లో ప్రభుత్వం ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసింది. భక్తులు అందులోనే విశ్రాంతి తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment