ఉత్తరాఖండ్లో మళ్లీ వర్షాలు.. నిలిచిన యాత్ర
ఉత్తరాఖండ్.. వర్షాలు.. ఈ మాటలు వింటే చాలు ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది. గత సంవత్సరం సరిగ్గా ఇదే సమయానికి అక్కడ భారీ వర్షాలు సృష్టించిన విలయం కళ్లముందు కదలాడుతుంది. తాజాగా మరోసారి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. దాంతో చార్ధామ్ యాత్రకు తీవ్ర ఆటంకం కలిగింది. కొండచరియలు, పెద్దపెద్ద చెట్లు విరిగి పడటంతో కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలకు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. గడిచిన రెండు రోజులుగా చంపావత్, చమోలి, నైనిటాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చమోలి జిల్లాలోని లాంబాగఢ్, చిరోబాగఢ్, విజయ్నగర్, అగస్తముని లాంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాబోయే 24 గంటల్లో కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రుద్రప్రయాగ, ఉత్తరకాశీ, పితోరాగఢ్ లాంటి ప్రాంతాలకు విపత్తు నివారణ బృందాలను పంపారు. హిమాలయ క్షేత్రాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నివారణ శాఖ హెచ్చరించింది. గత సంవత్సరం వచ్చిన వర్షాల కారణంగా వేలాదిమంది భక్తులు మరణించిన విషయం తెలిసిందే.