జైపూర్: సీనీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు డ్రైవర్ మహేశ్ ఠాకూర్ ను శుక్రవారం ఉదయం రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 304 ఏ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. గత రాత్రి మధుర నుంచి జైపూర్‌కు వెళుతుండగా... దౌసా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ హేమమాలిని తీవ్రంగా గాయపడగా, ఓ నాలుగేళ్ల బాలిక దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.
ఎంపీ కారును డ్రైవర్ మహేశ్ మితిమీరిన వేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, చిన్నారి మృతికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన చిన్నారి కుటుంబానికే చెందిన మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కూడదనే ఉద్దేశంతోనే పోలీసులు ఎంపీ కారు డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు సమాచారం.
మధుర నుంచి జైపూర్ వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు దౌసా వద్ద ఎదురుగా వస్తున్న ఆల్టో ఢీ కొన్నాయి. నుదుటికి తీవ్ర గాయాలైన హేమమాలినిని జైపూర్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె కనుబొమ్మల వద్ద కుట్లు వేసి, స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించారు.