
కేరళలో ‘ఏటీఎం’ హైటెక్ చోరీ !
తిరువనంతపురం: వినియోగదారులకు తెలియకుండానే వారి ఖాతాల నుంచి కొన్ని వేల రూపాయల నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం ద్వారా కొట్టేసినట్లు భావిస్తోన్న ఘటన కేరళ లో జరిగింది. తిరువనంతపురంలో వెల్లాయాంబాలమ్‌లో ఉన్న ఓ ప్రభుత్వ బ్యాంకు ఏటీఎంను 16 మంది వినియోగించుకున్నారు. సోమవారం తమ మొబైల్‌కు వచ్చిన సందేశాలు చూసుకుని వారు షాక్‌కు గురయ్యారు.
తాము ఉపసంహరించుకున్న మొత్తం కన్నా అధికంగా నగదు బయటకు వెళ్లినట్లు వాటిలో ఉంది. వెంటనే బాధితులు బ్యాంకు మేనేజర్, పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఏటీఎం కేంద్రంలో రహస్యంగా ఉంచిన ఎలక్ట్రానిక్ పరికరాలతో వినియోగదారుల కార్డు నెంబర్, పిన్‌లను పసిగట్టి నేరగాళ్లు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏటీఎం నుంచి పోలీసులు ఓ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.