
దారుణం చోటుచేసుకున్న ఏటీఎమ్ సెంటర్
సాక్షి, చెన్నై: ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన నలుగురు యువకులు పోలీసుల కళ్లెదుటే ఓ వ్యక్తిని గుండెల్లో పొడిచి చంపేశారు. శనివారం వేకువజామున తిరువారూర్–తిరుత్తురై పూండి మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి కూడూరు గ్రామంలో ఓ జాతీయ బ్యాంక్ ఏటీఎం ఉంది. శుక్రవారం అర్ధరాత్రి నలుగురు యువకులు ఏటీఎంలో చోరికి సిద్ధం అయ్యారు. అదే సమయంలో ఆ ఏటీఎంకు ఎదురుగా ఉంటున్న మదన్ అనే వ్యక్తి దీనిని పసిగట్టాడు. ఏటీఎం గదికి యజమాని అయిన తమిళరసన్, పోలీసులకు సమాచారం అందించాడు. తమిళరసన్ ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశాడు. ఏటీఎం వద్ద జనం చేరడంతో ఆ నలుగురు యువకులు మేల్కొన్నారు. తప్పించుకునే యత్నం చేశారు. ఇందులో ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు.
మెరుపు దాడి
తప్పించుకుని వెళ్లిన ముగ్గురు యువకులు కాసేపటి తర్వాత హఠాత్తుగా మెరుపు దాడి చేశారు. గస్తీలో ఉన్న ఇద్దరు పోలీసుల వైపుగా ఆయుధాలతో దూసుకొచ్చారు. తమను అడ్డుకునే ప్రయత్నం చేసిన తమిళరసన్‌ను పొడిచి చంపేశారు. తమ సహచరుడిని విడిపించుకుని వెళ్లారు. దీంతో తిరువారూర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కుర్తానల్లూరులో దాగి ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌కు ఒక యువకుడి కుడి కాలు, మరో యువకుడి ఎడమ కాలు, మిగిలిన ఇద్దరికి చేయి విరిగింది. వీరిని ఆస్పత్రికి తరలించి పిండి కట్టు వేశారు. నలుగురు యువకులు ఓ కళాశాలలో చదువుకుంటున్నట్టు విచారణలో తేలింది. మోటారు సైకిళ్లను చోరీ చేయడం, దారి దోపిడీలకు పాల్పడడం చేస్తున్నట్లు విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment