సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు నాలుగు వారాల్లో బదులివ్వాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు తమకు మరింత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు హైకోర్టును అభ్యర్ధించిన మీదట ఈ ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. పిటిషనర్ కేవలం మూడు ప్రసంగాలనే రెచ్చగొట్టే ప్రసంగాలుగా పేర్కొన్నారని, అయితే చాలా ద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లో భారత ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేయాలన్న తన అప్పీల్‌ను అంగీకరించాలని మెహతా కోర్టును కోరారు.
హింసతో అట్టుడుకుతున్న ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితి నెలకొనేలోగా ఈ పిటిషన్లపై స్పందించాల్సిన అవసరం లేదని, తమకు పెద్ద సంఖ్యలో వీడియోలు వచ్చాయని, వాటన్నింటినీ పరిశీలించి ఓ నిర్ణయానికి వచ్చేందుకు తమకు తగిన సమయం కావాలని మెహతా పేర్కొన్నారు. హింస, లూటీ, మరణాలకు సంబంధించి ఇప్పటివరకూ 48 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని, 106 మందిని అరెస్ట్‌చేశారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన మీదట మరికొన్ని అరెస్ట్‌లు చేపడతారని అన్నారు. ఢిల్లీ అల్లర్ల వెనుక వెలుపలి నుంచి వచ్చిన వారి పాత్రనూ నిగ్గుతేల్చాల్సి ఉందన్నారు.
కాగా, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు సైతం విద్రోహ ప్రసంగాలు చేశారని వారిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మరికొన్ని పిటిషన్లు నమోదయ్యాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ నేత అమనతుల్లా ఖాన్ సైతం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని, వారిపై కేసు నమోదు చేయాలని మరో పిటిషన్ నమోదైంది. ముంబై ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ అల్లర్లపై సుదీర్ఘ వాదనల అనంతరం పలువురు నేతలపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లపై బదులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నాలుగు వారాల గడువిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 13కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment