న్యూఢిల్లీ: 2016–17 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం పొందిన తొలి మూడు ప్రాంతీయ పార్టీలుగా సమాజ్‌వాదీ, టీడీపీ, అన్నా డీఎంకే నిలిచాయి. ఆ ఏడాదిలో 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం కలిపి రూ.321.03 కోట్లు కాగా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి వచ్చిన ఆదాయం రూ.82.76 కోట్లు. 32 పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 25.78%. రెండో స్థానంలో ఉన్న టీడీపీకి రూ.72.92 కోట్లు, ఆ తర్వాతి స్థానంలో నిలిచిన అన్నాడీఎంకేకు రూ. 48.88 కోట్ల ఆదాయం వచ్చింది.
పార్టీల ఆదాయ వ్యయాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను విశ్లేషించిన ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్) అనే సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. అయితే ఆర్జేడీ, ఆప్ వంటి 16 ప్రధాన ప్రాంతీయ పార్టీల వివరాలు లభించనందున వాటి వివరాల గురించి తెలియరాలేదంది. అత్యధికంగా వ్యయం చేసిన పార్టీల్లోనూ ఎస్పీ తొలిస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో అన్నా డీఎంకే, డీఎంకే ఉన్నాయి. ఈ మూడు పార్టీలు వాటికి వచ్చిన ఆదాయానికన్నా ఎక్కువే ఖర్చుపెట్టాయి. టీడీపీ 2016–17లో తనకు వచ్చిన ఆదాయంలో 33 శాతాన్నే ఖర్చు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment