విరిగి పడిన కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
- హిమాచల్‌లో ఘోరప్రమాదం.. మృతుల సంఖ్య 30పైనే!
- కొనసాగుతున్న సహాయక చర్యలు.. 8 మృత దేహాల గుర్తింపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో రెండు ప్యాసింజర్ బస్సులు 800 మీటర్ల లోతుగల లోయలో పడిపోయాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికీ 8 మంది మృత దేహాలు బయటకు తీసిన రెస్క్యూ టీం పలువురి క్షతగాత్రులను రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది.
మండి- పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న మూడు వాహనాలపై ఆదివారం తెల్లవారు జామున ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లా పదార్ మండలం కొట్రూపి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మనాలి- కట్రా, మనాలి- చంబా రెండు ప్యాసింజర్ బస్సులు ఉండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది.
ఒక్కో బస్సులో సుమారు 40 మంది ప్రయాణీకులన్నట్లు తెలుస్తోంది. బస్సులపై పూర్తిగా శిధిలాలు పేరుకుపోవడంతో క్షతగాత్రులను తీయడం ఇబ్బందిగా మారింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇలా కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు సంభవించడం హిమాచల్ ప్రదేశ్‌లో ఇది మూడో సారి. 1988 సిమ్లా జిల్లా ప్రమాదంలో 45 మంది మృతి చెందగా1994 కుల్లు జిల్లా ప్రమాదంలో 42 మంది మరణించారు.