హిమాచల్ దుర్ఘటన: శవాల వెలికితీతలో జాప్యమెందుకు?
"ఇది హైటెక్ యుగం. ఇక్కడ ఎన్నో టెక్నాలజీలున్నాయి. ఇన్ని రోజులైనా మనం శవాలను ఎందుకు వెలికి తీయలేకపోతున్నాం? ఆధునిక టెక్నాలజీ సాయాన్ని ఎందుకు తీసుకోవడం లేదు?' ఇది బివి సుబ్బారావు వేస్తున్న ప్రశ్న.
సుబ్బారావు ఆవేదనకు అర్ధం ఉంది. ఆయన కొడుకు హిమాచల్ దుర్ఘటనలో జలసమాధి అయిపోయాడు. కానీ ఇప్పటివరకూ భౌతికకాయం మాత్రం దక్కలేదు. సుబ్బారావు హిమాచల్ కొండల్లో, కులు లోయల్లో ఏమీ తెలియని ప్రదేశంలో తనకు బాగా తెలిసిన వాడి శవం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన మామూలు వ్యక్తి కారు. ఆయన డ్యామ్ ఇంజనీర్ కూడా.
24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను పొట్టనబెట్టుకున్న బియాస్ నది నుంచి శవాల వెలికితీత నత్తనడకన సాగుతోంది. అక్కడ పాత పద్ధతులనే ఉపయోగించడం జరుగుతోంది. కొక్కాలతో, వెదురు బొంగులతో వెతుకులాట కొనసాగుతోంది. చిన్న చిన్న పడవల్లో ఒకరిద్దరు మాత్రమే వెళ్లి వెతుకుతున్నారు. నీటి అడుగున చిత్రీకరించగలిగే కెమెరాలు అక్కడికి తీసుకొచ్చినా ఇప్పటి వరకూ వాటికి పని కల్పించలేదు. నేవీని పిలిపించాలని భావించినా ఇప్పటి వరకూ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు.
అసొం వంటి ప్రదేశాల్లో కొండనదులు ఉంటాయి. అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడి నుంచి గజీతగాళ్లను రప్పిస్తే అన్వేషణ సులువవుతుంది. కానీ ఇప్పటి వరకూ దాని విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
పోనీ లార్జి డ్యామ్ నుంచి నీటి విడుదలను ఆపుచేద్దామంటే అదీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆలా చేస్తే ప్రాజెక్టు ఎగువనున్న గ్రామాలు మునిగిపోతాయి. కొండరాళ్లతో నిండిన ఈ నదిలో పెద్ద పడవలు పనికిరావు. ఇవన్నీచాలవన్నట్టు ప్రాజెక్టు దిగువన భారీ పూడిక ఉంది. కొన్ని ప్రాంతాల్లో చాలా బురద ఉంది. ఇవన్నీ చాలవన్నట్టు కొన్ని చోట్ల సుడిగుండాలున్నాయి. వీటన్నిటి వల్లా శవాల వెలికితీత చాలా ఆలస్యం అవుతుంది.
అయితే తమ కన్న బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు మాత్రం ఈ ఎదురుచూపులు నరకాన్ని చూపిస్తున్నాయి. వారి పరిస్థితి దయనీయంగా ఉంది.