షాక్‌కు గురయ్యాం
అచ్యుత్‌కుమార్ తల్లిదండ్రులు తల్లాడ శ్రీనివాస్-శ్రీదేవి
భానుపురి : విద్యార్థులు నదిలో కొట్టుకుపోయిన వార్త వినగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యామని బియాస్‌నది ప్రమాదంనుంచి బయటపడిన సూర్యాపేటకు చెందిన అచ్యుత్‌కుమార్ తల్లిదండ్రులు తల్లాడ శ్రీనివాస్-శ్రీదేవిలు తెలిపారు. ‘సాక్షి’తో వెల్లడించిన విషయాలు వారి మాటల్లోనే.. వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ మూడో సంవత్సరం చదువుతున్న మా కుమారుడు అచ్యుత్‌కుమార్ విహారయాత్రకు వెళ్తాననగానే పంపించాం. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో అచ్యుత్‌కుమార్ ఫోన్ చేసి కులుమనాలి వద్ద నదిలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద పెరిగిందని.. దానిలో తనతో పాటు విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు కొంతమంది కొట్టుకుపోయారని తెలిపారు. నదిలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిందని, దానిని గమనించి మా కుమారుడు నీటిలో నుండి ఒడ్డుకు వెళ్లాడని తెలిపారు.
ఆ సమయంలో తన స్నేహితులను నది నుండి బయటకు రావాలని కోరగా నీవు వెళ్లు మేం వస్తాం అని మిగతా వారన్నారని.. అంతలోనే నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో ఉన్న వారంతా కొట్టుకుపోయినట్లు తెలిపారు. వారిని రక్షించేందుకు కొంతమంది ఒడ్డున వారు ప్రయత్నించగా వారుకూడా నదిలో కొట్టుకుపోయారని తెలిపారు. స్నేహితులు కళ్ల ముందు నీటిలో కొట్టుకుపోతున్న సంఘటనను చూసిన మా కుమారుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడని చెప్పారు. అదే సమయంలో తన సెల్‌ఫోన్‌లో చార్జింగ్ తక్కువగా ఉందని అంతా చీకటిగా ఉందని తనకు భయమేస్తుందని కుమారుడు తెలపడంతో మాకు వణుకు పుట్టిందని తెలిపారు. మరుసటి రోజు కొంతదూరం వెళ్లి సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టిన అనంతరం తిరిగి తమకు ఫోన్ చేశాడని అప్పటి వరకు భయాందోళన మధ్య రాత్రి మొత్తం నిద్రలేకుండా గడిపామని చెప్పారు.