
కేంద్రాన్ని ధిక్కరిస్తే వేటే
కేంద్రంలో అధికార మార్పిడి జరిగినప్పుడు.. పాత ప్రభుత్వం నియమించిన గవర్నర్లను కొత్త సర్కారు తొలగించడం ప్రజాస్వామ్య భారతంలో మామూలే. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే నియమించిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాను సెప్టెంబర్ 12వ తేదీన ఆ ప్రభుత్వమే పదవి నుంచి తొలగించింది. గవర్నర్‌ను నియమించిన ప్రభుత్వమే తొలగించడం దేశ రాజకీయ చరిత్రలో బహూశ ఇదే మొదటిసారి కావచ్చు.
కేంద్రంలోని ఓ పార్టీ ప్రభుత్వం నియమించిన గవర్నర్లను మరో పార్టీ అధికారంలోకి రాగానే తొలగించే ఆనవాయితీ 1980లో ప్రారంభమైంది. 1977లో అప్పటి జనతాపార్టీ ప్రభుత్వం నియమించిన తమిళనాడు గవర్నర్ ప్రభుదాస్ పట్వారీని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఇందిర ప్రభుత్వం తొలగించింది. మురార్జి దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ నియమించిన రాజస్థాన్ గవర్నర్ రఘుకుల్ తిలక్‌ను 1981లో ఇందిరాగాంధీ ప్రభుత్వమే తొలగించింది. అప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిలక్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది.
1989లో అధికారంలోకి వచ్చిన వీపీ సింగ్ ప్రభుత్వం గవర్నర్లను ఎప్పుడు పడితే అప్పుడు తొలగించేందుకు వీలుగా ముందే అన్ని రాష్ట్రాల గవర్నర్ల నుంచి రాజీనామా లేఖలను తీసుకోవాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటల్లో ఇరుక్కుపోవడం వల్ల ఆయన తన నిర్ణయాన్ని అమలు చేయలేకపోయారు.
వాజపేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడు గవర్నర్ జస్టిస్ (రిటైర్డ్) ఫాతిమా బీవీని 2001లో తొలగించింది. ఆమె సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయిన తొలి మహిళా జడ్జీయే కాకుండా తమళనాడుకు నియమితులైన తొలి మహిళా గవర్నర్ కూడా. డీఎంకే చీఫ్ కరుణానిధి, అన్నాడీఎంకే అధినేత జయలలిత రాజకీయాలకు అనవసరంగా ఆమె బలయ్యారు. అప్పడు జయలలిత ముఖ్యమంత్రి కాగా, కేంద్రంలోని ఎన్డీయే పక్షంలో డీఎంకే భాగస్వామిగా కొనసాగింది.
2004, జూలైలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సిఫార్సుపై అంతకుముందు ప్రభుత్వం నియమించిన యూపీ గవర్నర్ విష్ణుకాంత్ శాస్త్రీ, గుజరాత్ గవర్నర్ కైలాష్‌పతి మిశ్రా, హర్యానా గవర్నర్ బాబూ పరమానంద, గోవా గవర్నర్ కిదార్‌నాథ్ సాహ్నిని తొలగించారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. 2012లో కూడా గవర్నర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం లేదా ఆ పార్టీ విధానాలకు అనుకూలంగా లేరన్న కారణంతోగానీ, గవర్నర్ పట్ల కేంద్రానికి విశ్వాసం లేదన్న కారణంగా గానీ గవర్నర్లను తొలగించడానికి వీల్లేదని చెప్పింది.