
కృష్ణుడే తిరుగాడినట్లు..
ప్రపంచంలోనే ఎత్తయిన ఆలయంగా నిర్మించనున్న ‘బృందావన్ చంద్రోదయ మందిర్’కు ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శంకుస్థాపన చేశారు
ప్రపంచంలోనే అతి ఎత్తై ఆలయంగా ‘బృందావన్’ శంకుస్థాపన చేసిన యూపీ సీఎం
70వ అంతస్తులో టెలిస్కోప్ నుంచి తాజ్‌మహల్‌నూ చూడొచ్చు
బృందావనం: ప్రపంచంలోనే ఎత్తయిన ఆలయంగా నిర్మించనున్న ‘బృందావన్ చంద్రోదయ మందిర్’కు ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఉన్న బృందావనంలో దాదాపు రూ. 300 కోట్ల వ్యయంతో ఇస్కాన్ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. హిందువుల పర్వదినం హోలీ సందర్భంగా దీనికి శంకుస్థాపన చేశారు. ఐదేళ్లలో ఈ ఆలయాన్ని పూర్తి చేయనున్నారు. దాదాపు 62 ఎకరాల్లో 213 మీటర్ల ఎత్తుతో 70 అంతస్తులుగా దీనిని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఆలయం నిర్మించడం మాత్రమే తమ లక్ష్యం కాదని.. కృష్ణుడు తిరుగాడినప్పటి అనుభూతిని కల్పించడమని ఇస్కాన్ ప్రతినిధి చాంచలపతి దాస్ చెప్పారు. అప్పటి బృందావనంతో పాటు అడవిని కూడా ఆలయం చుట్టూ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వేదాల్లో పేర్కొన్నట్లుగా విశ్వం, అంతరిక్షం వంటివన్నింటినీ తలపించేలా ప్రత్యేకమైన ధ్వని, వెలుగు, ఎఫెక్టులతో ఎలివేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 70వ అంతస్తులో ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాలను చూడడానికి టెలిస్కోపులు చేర్పాటు చేస్తామని.. వాటి ద్వారా కృష్ణ జన్మభూమిని, ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా వీక్షించవచ్చని తెలిపారు. నెమలి పింఛాన్ని తలపించేలా ఆలయానికి ఆకుపచ్చ, నీలం రంగులను వేయనున్నట్లు చెప్పారు. కాగా, శంకుస్థాపన చేసిన అనంతరం అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ... ఇదొక చరిత్రాత్మక సమయమని, దేశ సంస్కృతికి, ఘన వారసత్వానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుందని పేర్కొన్నారు.