అడవి పందులను తరిమేస్తున్న హనీసింగ్!
నైనిటాల్: 'శిశుర్వేత్తి పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః' అంటారు. సంగీతానికి పశుపక్ష్యాదులు సైతం స్పందిస్తాయని వింటూనే ఉంటాం. అదే సంగీతంతో అడవిపందులను సైతం తరిమేయొచ్చా? అవునంటున్నారు రైతులు. ఉత్తరాఖండ్ రైతులకు అడవిపందుల బెడద ఎక్కువగా ఉంది. అవి తమ పంటలను సర్వనాశనం చేస్తుండటంతో వాటిని తరిమేయాలని రైతులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ అది సర్కారుకు తలకు మించిన భారం అవుతుంది. దీంతో అక్కడి రైతులు వినూత్నంగా ఆలోచించారు. తమ పొలాల వద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. వాటిలో పంజాబీ గాయకుడు యోయో హనీసింగ్ పాటలను ప్లే చేస్తున్నారు. అది కూడా భారీ శబ్దంతో.. ఈ ఐడియా బ్రహ్మాండంగా పనిచేసింది. దీంతో అడవి పందులతో పాటు ఇతర జంతువులు కూడా తమ పొలాల జోలికి రాకుండాపోయాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నైనిటాల్ జిల్లాలోని ధరి గ్రామానికి చెందిన రైతు బిషన్ జంత్వాల్ బంగాళాదుంపలు సాగుచేశాడు. అడవిపందుల బెడద నుంచి పంటను కాపాడుకోవడానికి వ్యవసాయ క్షేత్రం చుట్టూ స్పీకర్లను ఏర్పాటుచేసి మంచి ఫలితాలను పొందాడు. తర్వాత ఇదే విధానాన్ని ఆ ప్రాంతంలోని ఇతర రైతులు కూడా అనుసరిస్తున్నారు.