
కారులోకి దూసుకొచ్చిన అశ్వం
జైపూర్:
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు కార్లు, ఆటోలు, బస్సుల వంటివి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నప్పుడో, లేదా అవి మనుషులపైకి వచ్చినప్పుడో జరుగుతుంటాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో మాత్రం ఓ వింత రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్రం రోడ్డుపై వెళ్తున్న కారు అద్దం పగులగొట్టుకుని అందులోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో గుర్రంతోపాటు కారు డ్రైవర్‌కూ గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం రోడ్డుపై వెళ్తుండగా ఆ గుర్రానికి ఏమైందో ఏమోగానీ ఉన్నట్టుండి ఎదురుగా వస్తున్న కారుపైకి దూకింది. ఓ వైపు ఎండ వేడిమి, మరోవైపు రోడ్డుపై వాహనాలు చేసే శబ్దాల వల్ల గుర్రానికి చిర్రెత్తుకొచ్చి కారులోకి దూకి ఉంటుందని భావిస్తున్నారు. అశ్వం కారులోనే ఇరుక్కుపోగా స్థానికులు, అటవీశాఖ అధికారులు కలిసి దానిని రక్షించారు.