హిమాచల్ ప్రదేశ్ మంత్రి ఒకరు కోతుల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేసి అవి రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని, ఆర్థికంగా కోట్లలో నష్టాన్ని కలిగిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ మంత్రి ఒకరు కోతుల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేసి అవి రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని, ఆర్థికంగా కోట్లలో నష్టాన్ని కలిగిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాటిని ఎలా కట్టడి చేయాలో తమకు సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో అటవీ శాఖమంత్రిగా ఠాకూర్ సింగ్ భార్మౌరి పనిచేస్తున్నారు.
ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో కోతుల బెడద ఎక్కువైందని చెప్పారు. ప్రజలు, రైతులు, జంతు హక్కుల ఉద్యమకారులు, చట్టప్రతినిధులు ఎవరైనా సరే తమకు కోతుల కట్టడి విషయంలో సలహాలు సూచనలు ఇవ్వొచ్చని అన్నారు. 1990లో 61 వేల కోతులు ఉండగా.. 2004లో అవి 3,17,000 పెరిగాయని అన్నారు. స్టెరిలైజేషన్ ప్రోగ్రాం ద్వారా వాటి సంఖ్యను 2,07,614కు తగ్గించగలిగామని చెప్పారు. ఇవి పంటపొలాలను ధ్వంసం చేయడం కారణంగా కోట్లలో నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.