
మహారాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాల్ఘర్ జిల్లాలో ఈ ఏడాది పోషకాహార లోపంతో 600 మంది చిన్నారులు మరణించిన ఉదంతంలో నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్నిఆదేశించింది. పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ స్పందించింది. పాల్ఘర్ లోని మొఖాడా, జవర్, వాడా , విక్రమ్ గఢ్ లలోని నాలుగు తాలూకాలో ఈ మరణాలు సంభవించాయి.
పేదరికం, నిరక్షరాస్యత కారణంగా వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన లేదని అందుకే ఈ మరణాలు సంభవిస్తున్నాయని అక్కడి మీడియా కథనాలు ప్రసారం చేసింది. పోషకాహారలోపంతో మరణాలు సంభవించడం అంటే పేదవారి జీవించే హక్కును కాలరాయడమే అవుతుందని కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ట్రైబల్ ఏరియాలో అమలు చేస్తున్న పథకాల గురించి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.