
చెన్నై నుంచి హైదరాబాద్ ప్రయాణికుల తరలింపు
హైదరాబాద్/చెన్నై: చెన్నై ఎయిర్ పోర్ట్లో చిక్కుకున్న మహానగర వాసులను హైదరాబాద్కు తరలిస్తున్నారు. సాయంత్రం 4:30 గంటలకు 106 మంది ప్రయాణికులను హైదరాబాద్ కు తరలించినట్లు చెన్నై అధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో మూడు గంటలకు 87 మంది ప్రయాణికులను హైదరాబాద్కు తరలింపు కార్యక్రమాన్ని మొదలెట్టారు. చెన్నై విమానాశ్రయంలో చిక్కుకున్న ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులను వారి సొంత ప్రాంతాలకు పంపే యత్నాలు సాఫీగా సాగుతున్నాయి.
తమిళనాడులో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పలు విమాన, రైలు సర్వీసులు రద్దయిన విషయం అందరికీ విదితమే. చెన్నై ఎయిర్పోర్ట్ రన్ వే పూర్తిగా నీటితో నిండిపోవడం, రోడ్లు కూడా జలమయం అవకావడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో అధికారులు తమ సహాయక చర్యలను ముమ్మరం చేశారు.