నన్ను ఎవరైనా తిట్టినా సంతోషమే: రాహుల్ గాంధీ
తనను ఎవరైనా తిడితే ఇష్టమని చెబుతున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. తనను కామన్వెల్త్ క్రీడలు, వీవీఐపీ హెలికాప్టర్ల స్కాముల్లోకి లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా జంకేది లేదన్నారు. తనను ఎవరైనా తిట్టినా, టార్గెట్ చేసినా తనకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. తననే లక్ష్యంగా చేసుకుని ఎప్పుడూ అందరూ ఏవో ఒకటి అంటుంటారని చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే సమయంలో విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కామన్వెల్త్ క్రీడల స్కాంలో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్తో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధాలపైన, అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రాహుల్ రాజకీయ అనుచరుడొకరు మధ్యవర్తిగా వ్యవహరించిన విషయంపైన విచారణ జరపాలంటూ బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య ఈడీకి, సీబీఐకి లేఖలు రాశారు. ఈ అంశంపైనే రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయనిలా సమాధానమిచ్చారు. రెండు స్కాముల్లోను గుడో హష్కె అనే మధ్యవర్తి ఉన్నాడని, అతడికి హెలికాప్టర్ల స్కాంలోని నిందితుడు క్రిస్టియన్ మైఖేల్తో సంబంధాలున్నాయని కిరీట్ సోమయ్య ఆరోపించారు.