kirit somaiya
-
బీజేపీ ఎంపీపై యువతి ఫిర్యాదు
సాక్షి, ముంబై: వీధి ప్రక్కన కూరగాయలు అమ్ముకుంటున్న ఓ యువతి బీజేపీ ఎంపీపై ముంబై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ కిరిత్ సోమయ్య తాను కూరగాయలు అమ్ముకునే ప్రదేశాన్ని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని, అంతటితో ఆగకుండా పెనాల్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారని యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న కూరగాయల సంచి విసిరేసి, తన వద్ద నుంచి రూ.1250 వసూలు చేశారని అమె తెలిపారు. ఎంపీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని యువతి పోలీసులను కోరారు. -
‘ఆ జ్యోతిష్యుడు చెప్పిన వ్యక్తి మోదీనే’
న్యూఢిల్లీ: భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లగల వ్యక్తి తూర్పు ప్రాంతంలో జన్మిస్తారని ఫ్రాన్స్ దేశానికి చెందిన జ్యోతిష్యశాస్త్రవేత్త నోస్ట్రాడామస్ అప్పట్లోనే చెప్పారని, ఆ వ్యక్తి మరెవరో కాదని, ప్రధాని నరేంద్రమోదీనేనని బీజేపీ నేత, లోక్‌సభ సభ్యుడు కిరిత్ సోమయ్య చెప్పారు. సోమవారం లోక్‌సభలో గ్రాంటులకోసం సప్లిమెంటరీ డిమాండ్స్‌పై మాట్లాడే సందర్భంలో ఆయన ఈ విషయం చెప్పారు. ‘తూర్పు ప్రాంతంలో ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని, అతడే భారతదేశాన్నిసరికొత్త అత్యున్నత శిఖరాలకు చేరుస్తారని నోస్ట్రాడామస్ అనాడే చెప్పారు. ఆయన చెప్పిన వ్యక్తి ఎవరో కాదు.. ప్రధాని నరేంద్రమోదీనే’ అని ఆయన అన్నారు. మరోపక్క, ప్రతిపక్షాలు ఏ చర్చ తీసుకొచ్చినా అందులోకి పెద్ద నోట్ల రద్దు విషయాన్ని తీసుకొచ్చి వితండవాదం చేస్తున్నారని ఆరోపించారు. నోస్ట్రాడామస్ ఫ్రాన్స్ దేశానికి చెందిన జ్యోతిష శాస్త్రవేత్త. 1547 సంవత్సరం ప్రాంతంలో ఆయన భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారు. ఆయన జోస్యాలతో కూడిన గ్రంథం పేరు సెంచరీస్. ఆ గ్రంథంలో ఆయన చెప్పినవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని అందరూ విశ్వసిస్తుంటారు. హిట్లర్ గురించి, 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి గురించి ఆయన ముందే చెప్పారని అంటుంటారు. -
నన్ను ఎవరైనా తిట్టినా సంతోషమే: రాహుల్ గాంధీ
తనను ఎవరైనా తిడితే ఇష్టమని చెబుతున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. తనను కామన్వెల్త్ క్రీడలు, వీవీఐపీ హెలికాప్టర్ల స్కాముల్లోకి లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా జంకేది లేదన్నారు. తనను ఎవరైనా తిట్టినా, టార్గెట్ చేసినా తనకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. తననే లక్ష్యంగా చేసుకుని ఎప్పుడూ అందరూ ఏవో ఒకటి అంటుంటారని చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే సమయంలో విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కామన్వెల్త్ క్రీడల స్కాంలో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్‌తో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధాలపైన, అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రాహుల్ రాజకీయ అనుచరుడొకరు మధ్యవర్తిగా వ్యవహరించిన విషయంపైన విచారణ జరపాలంటూ బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య ఈడీకి, సీబీఐకి లేఖలు రాశారు. ఈ అంశంపైనే రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయనిలా సమాధానమిచ్చారు. రెండు స్కాముల్లోను గుడో హష్కె అనే మధ్యవర్తి ఉన్నాడని, అతడికి హెలికాప్టర్ల స్కాంలోని నిందితుడు క్రిస్టియన్ మైఖేల్‌తో సంబంధాలున్నాయని కిరీట్ సోమయ్య ఆరోపించారు. -
‘పులి’తో దోస్తీ కుదిరేనా?
కమలానికి ‘అండ’ ఎవరో.. ‘మద్దతు’పై కొనసాగుతున్న ఉత్కంఠ.. షరతులతో మద్దతుకు శివసేన సిద్ధం? సాక్షి ముంబై: మహారాష్ట్రలో అధికారం ఎవరు చేపట్టనున్నారన్నదానిపై గంటగంటకు ఉత్కంఠత తీవ్రమవుతోంది. పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఎవరి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనునందన్న విషయంపై రాష్ట్రంతో పాటు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఒక వైపు రాష్ట్ర ప్రయోజనాలు, సంక్షేమం కోసం బీజేపీకి బయటి నుంచి ఎన్సీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీ మద్దతు తీసుకోవడాన్ని ఆర్.ఎస్.ఎస్. వ్యతిరేకించడంతో పాటు పాతమిత్రులైన శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీకి సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందా...? శివసేన మద్దతు తీసుకుంటుం దా...? లేదా చిన్న పార్టీలతో పాటు ఇండిపెండెంట్ల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది. బీజేపీ మద్దతుకు శివసేన సిద్ధమే... ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కన్నేసి ఉంచిన శివసేన ఆచి తూచి అడుగులు వేస్తోంది. అధికారంలో కీలక శాఖలు లభించినట్లయితే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివసేన ప్రకటించింది. అయితే బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఒకవేళ వచ్చినట్లయితే ప్రతిపాదనను పరిశీలించి తమ నిర్ణయాన్ని తెలుపుతామని శివసేన నాయకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సోమవారం మాతోశ్రీలో శివసేన అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో పొత్తులపై చర్చలు జరిపినట్లు సమాచారం. 135 మంది ఎమ్మెల్యేల బలం ఉంది-కిరీట్ సోమయ్య బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధీమాను ఆ పార్టీ నాయకుడు కిరీట్ సోమయ్య వ్యక్తం చేశారు. తమకు 122 స్థానాలు ఉన్నాయని, దీంతో పాటు మిత్ర పక్షాలు, ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు తమకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన మీడియాతో పేర్కొన్నారు. ప్రస్తుతం తమకు 135 సంఖ్యా బలమైతే ఉందని ఆయన పేర్కొనడం విశేషం. ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే బీజేపీలో...... మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పరువు కాపాడిన ఒకే ఒక్క ఎమ్మెల్యే శరత్ సొనావణే బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలిసింది. బీజేపీ అధికారం చేపట్టేందుకు అనేక మందిని సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జున్నర్‌లో ఎమ్మెన్నెస్ టికెట్‌పై గెలిచిన శరత్ సొనావణేను సంప్రదింపులు జరిపింది. ప్రతిపక్షంలో ఎవరు? శాసనసభ ఎన్నికల ఫలితాల వెల్లడి ఆదివారం రాత్రి వరకు ముగియడంతో ఇక ప్రతిపక్ష హోదాలో ఎవరు కొనసాగుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాల్లో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇతర పార్టీల మద్దతు తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తర్వాత స్థానంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు ఉన్నాయి. ఒకవేళ చర్చలు సఫలమై పాతమిత్రులైన బీజేపీ, శివసేన జతకడితే మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంది. ప్రతిపక్షంలో తామే కొనసాగుతామని కాంగ్రెస్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా, బీజేపీకి బేషరతుగా బయటనుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్సీపీ ప్రకటించింది. ఒకవేళ బీజేపీ ఆ పార్టీ మద్దతు తీసుకుంటే ఇక ప్రతిపక్షంలో శివసేన కొనసాగుతుంది. ఒకవేళ బీజేపీకి శివసేన మద్దతు ఇచ్చినా మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్సీపీ కంటే కాంగ్రెస్‌కు ఒక సీటు మాత్రమే ఎక్కువ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎన్సీపీతో జతకట్టిన హితేంద్ర ఠాకూర్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. వీరి మద్దతు తీసుకుంటే కాంగ్రెస్ కంటే ఎన్సీపీ వద్ద ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారు. దీంతో ఎన్సీపీ కూడా ప్రతిపక్షం హోదాపై కన్నేసే ఆస్కారముందని చెప్పవచ్చు. ఏదేమైనా, బీజేపీ ఎవరి మద్దతు తీసుకుంటుందో తేలిన తర్వాతే ప్రతిపక్ష హోదాపై ఒక స్పష్టత వస్తుంది. ఎమ్మెల్యేలుగా ఆరుగురు కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో 23 మంది బీఎంసీ కార్పొరేటర్లు బరిలో దిగినప్పటికీ ఐదుగురిని మాత్రమే విజయం వరించింది. దహిసర్ నియోజక వర్గం నుంచి మనీషా చౌదరి, పశ్చిమ అంధేరి నుంచి అమిత్ సాటం, సైన్ కోలివాడ నుంచి ఆర్.తమిల్ సెల్వం, గోరేగాం నుంచి గెలిచిన విద్యా ఠాకూర్ బీజేపీ వారు కాగా, శివసేన తరఫున పశ్చిమ భాండూప్ నుంచి అశోక్ పాటిల్, దిండోషి నుంచి సునీల్ ప్రభు ఉన్నారు. అలాగే ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా పోటీచేసి గెలుపొందారు. బీజేపీకి చెందిన వినోద్ తావ్డే(బోరివలి), ఆషిష్ షెలార్(పశ్చిమ బాంద్రా), కాంగ్రెస్‌కు చెందిన డి.పి.సావంత్(ఉత్తర నాందేడ్) వీరిలో ఉన్నారు. -
చవాన్ విషయంలో జోక్యం చేసుకోం: సుప్రీం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన వ్యహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 15 రోజుల్లో ఈ వ్యవహారం తేల్చాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టప్రకారమే ఈ విషయంలో హైకోర్టు ముందుకెళుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. బీజేపీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరిట్ సోమయ్యలతో పాటు మరో స్వతంత్ర సభ్యుడు చవాన్ వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. -
అశోక్ చవాన్ కు ఊరట
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఊరట లభించింది. ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. బీజేపీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరిట్ సోమయ్యలతో పాటు మరో స్వతంత్ర సభ్యుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. చవాన్ వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి వీరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలకు అనుగుణంగా తన ఎన్నికల ప్రచార వ్యయం వివరాలను ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంటూ ఎన్నికల సంఘం జూలై 13న చవాన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. జవాబిచ్చేందుకు 20 రోజుల గడువిచ్చింది. -
ఇదేమి దర్యాప్తు?
ముంబై: మంత్రి సునీల్ తట్కరేపై కేసుపై నగర పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు జరపడం లేదంటూ బాంబే హైకోర్టు శుక్రవారం నగర పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నగర పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) దర్యాప్తు చేయకపోగా పిటిషనర్ కిరీట్ సోమయ్య అందిస్తున్న పత్రాలపైనే ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది. వారు స్వతంత్రంగా ఏమీ చేయలేదు’ అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఎస్.సోనక్‌ల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తు సంస్థ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం పై విధంగా స్పందించింది. కాగా మంత్రి సునీల్ తట్కరే, ఆయన బంధువులు కలసి ఏర్పాటుచేసిన వివిధ సంస్థలు మనీల్యాండరింగ్‌తోపాటు భూకబ్జాలకు పాల్పడ్డాయని, అందువల్ల ఆయా సంస్థలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ )తో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య బాంబే హైకోర్టులో గతంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి విదితమే. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ కేసును విచారించి, ఓ నివేదిక సమర్పించాలంటూ ఈఓడబ్ల్యూతోపాటు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లను అప్పట్లో ఆదేశించింది. దీంతో ఈఓడబ్ల్యూతోపాటు ఏసీబీ అధికారులు, రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్లు రూపొందించిన నివేదికలను అడ్వొకేట్ జనరల్ దారియస్ ఖంబాటా శుక్రవారం హైకోర్టుకు సమర్పించారు.