‘పులి’తో దోస్తీ కుదిరేనా?
కమలానికి ‘అండ’ ఎవరో..
‘మద్దతు’పై కొనసాగుతున్న ఉత్కంఠ..
షరతులతో మద్దతుకు శివసేన సిద్ధం?
సాక్షి ముంబై: మహారాష్ట్రలో అధికారం ఎవరు చేపట్టనున్నారన్నదానిపై గంటగంటకు ఉత్కంఠత తీవ్రమవుతోంది. పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఎవరి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనునందన్న విషయంపై రాష్ట్రంతో పాటు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఒక వైపు రాష్ట్ర ప్రయోజనాలు, సంక్షేమం కోసం బీజేపీకి బయటి నుంచి ఎన్సీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీ మద్దతు తీసుకోవడాన్ని ఆర్.ఎస్.ఎస్. వ్యతిరేకించడంతో పాటు పాతమిత్రులైన శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీకి సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందా...? శివసేన మద్దతు తీసుకుంటుం దా...? లేదా చిన్న పార్టీలతో పాటు ఇండిపెండెంట్ల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది.
బీజేపీ మద్దతుకు శివసేన సిద్ధమే...
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కన్నేసి ఉంచిన శివసేన ఆచి తూచి అడుగులు వేస్తోంది. అధికారంలో కీలక శాఖలు లభించినట్లయితే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివసేన ప్రకటించింది. అయితే బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఒకవేళ వచ్చినట్లయితే ప్రతిపాదనను పరిశీలించి తమ నిర్ణయాన్ని తెలుపుతామని శివసేన నాయకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సోమవారం మాతోశ్రీలో శివసేన అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో పొత్తులపై చర్చలు జరిపినట్లు సమాచారం.
135 మంది ఎమ్మెల్యేల బలం ఉంది-కిరీట్ సోమయ్య
బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధీమాను ఆ పార్టీ నాయకుడు కిరీట్ సోమయ్య వ్యక్తం చేశారు. తమకు 122 స్థానాలు ఉన్నాయని, దీంతో పాటు మిత్ర పక్షాలు, ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు తమకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన మీడియాతో పేర్కొన్నారు. ప్రస్తుతం తమకు 135 సంఖ్యా బలమైతే ఉందని ఆయన పేర్కొనడం విశేషం.
ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే బీజేపీలో......
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పరువు కాపాడిన ఒకే ఒక్క ఎమ్మెల్యే శరత్ సొనావణే బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలిసింది. బీజేపీ అధికారం చేపట్టేందుకు అనేక మందిని సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జున్నర్‌లో ఎమ్మెన్నెస్ టికెట్‌పై గెలిచిన శరత్ సొనావణేను సంప్రదింపులు జరిపింది.
ప్రతిపక్షంలో ఎవరు?
శాసనసభ ఎన్నికల ఫలితాల వెల్లడి ఆదివారం రాత్రి వరకు ముగియడంతో ఇక ప్రతిపక్ష హోదాలో ఎవరు కొనసాగుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాల్లో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇతర పార్టీల మద్దతు తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తర్వాత స్థానంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు ఉన్నాయి. ఒకవేళ చర్చలు సఫలమై పాతమిత్రులైన బీజేపీ, శివసేన జతకడితే మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంది. ప్రతిపక్షంలో తామే కొనసాగుతామని కాంగ్రెస్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా, బీజేపీకి బేషరతుగా బయటనుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్సీపీ ప్రకటించింది. ఒకవేళ బీజేపీ ఆ పార్టీ మద్దతు తీసుకుంటే ఇక ప్రతిపక్షంలో శివసేన కొనసాగుతుంది. ఒకవేళ బీజేపీకి శివసేన మద్దతు ఇచ్చినా మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్సీపీ కంటే కాంగ్రెస్‌కు ఒక సీటు మాత్రమే ఎక్కువ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎన్సీపీతో జతకట్టిన హితేంద్ర ఠాకూర్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. వీరి మద్దతు తీసుకుంటే కాంగ్రెస్ కంటే ఎన్సీపీ వద్ద ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారు. దీంతో ఎన్సీపీ కూడా ప్రతిపక్షం హోదాపై కన్నేసే ఆస్కారముందని చెప్పవచ్చు. ఏదేమైనా, బీజేపీ ఎవరి మద్దతు తీసుకుంటుందో తేలిన తర్వాతే ప్రతిపక్ష హోదాపై ఒక స్పష్టత వస్తుంది.
ఎమ్మెల్యేలుగా ఆరుగురు కార్పొరేటర్లు
ఈ ఎన్నికల్లో 23 మంది బీఎంసీ కార్పొరేటర్లు బరిలో దిగినప్పటికీ ఐదుగురిని మాత్రమే విజయం వరించింది. దహిసర్ నియోజక వర్గం నుంచి మనీషా చౌదరి, పశ్చిమ అంధేరి నుంచి అమిత్ సాటం, సైన్ కోలివాడ నుంచి ఆర్.తమిల్ సెల్వం, గోరేగాం నుంచి గెలిచిన విద్యా ఠాకూర్ బీజేపీ వారు కాగా, శివసేన తరఫున పశ్చిమ భాండూప్ నుంచి అశోక్ పాటిల్, దిండోషి నుంచి సునీల్ ప్రభు ఉన్నారు. అలాగే ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా పోటీచేసి గెలుపొందారు. బీజేపీకి చెందిన వినోద్ తావ్డే(బోరివలి), ఆషిష్ షెలార్(పశ్చిమ బాంద్రా), కాంగ్రెస్‌కు చెందిన డి.పి.సావంత్(ఉత్తర నాందేడ్) వీరిలో ఉన్నారు.