'నేనిక రాజకీయాలు మాట్లాడకూడదు'
హైదరాబాద్: ఇక తాను రాజకీయాల గురించి మాట్లాడకూడదని ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడు అన్నారు. తనకు కొత్తగా వచ్చిన బాధ్యతలు(ఉప రాష్ట్రపతి) ప్రకారం తాను రాజకీయాలకు అతీతం అని చెప్పారు. అయితే, ప్రజలకు సంబంధించిన అంశాలపై స్పందించకుండా ఉండటం మాత్రం దీని అర్థం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను మరోసారి చదువులో నిమగ్నమైపోయానని, తనకంటే ముందు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన మహనీయులు సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్ వంటి వారు చేసిన కార్యకలాపాలను గురించి అధ్యయనం చేస్తున్నానని తెలిపారు.
కొత్త బాధ్యతలు తెలుసుకునేందుకు కొంతమంది అధికారులను కూడా సంప్రదించనున్నట్లు వివరించారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో తాను అర్థవంతమైన చర్చ జరిగేలా చూస్తానని, ప్రతిపక్షాలు, అధికార పక్షము అని కాకుండా అందరికీ సమానంగా మాట్లాడే అవకాశం ఇస్తానని అన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, ఆర్థిక తారతమ్యాలు, వివిధ వర్గాలపై ఉన్న వివక్షతలు, వాతావరణ నిర్లక్ష్యంలాంటి అంశాలను పరిశీలిస్తున్నానని ఈ అంశాల పరిష్కారమే దేశ ప్రధాన అజెండాగా ఉండాలని ఆయన తెలిపారు.