తల్లీదండ్రులతో వన్మతి. (ఆమె సివిల్స్ పరీక్షరాసిన రెండో రోజే తండ్రి తలకు తీవ్రగాయమైంది. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నాడు)
చెన్నై: మంచి బట్టలు, చెప్పులు లేనిదే నలుగురితో కలవలేని పరిస్థితి నేటి విద్యార్థులది. వన్మతి మాత్రం అవేవీ ఆలోచించదు. స్కూలుకు పోయేటప్పుడు బర్రెను తోలుకెళ్లి పచ్చిక బైళ్లలో వదిలేస్తుంది. మళ్లీ వచ్చేటప్పుడు వెంటబెట్టుకొస్తుంది. ఇంటర్, డిగ్రీల్లోనూ తన దినచర్య మారలేదు. 'ఎదిగిన అమ్మాయివి.. గేదెను తోలుకెళ్లడం నామోషీగాలేదూ..' అని కొందరనేవాళ్లు. వన్మతి మాత్రం తన లక్ష్యాన్ని తప్ప మరిదేనినీ లక్ష్యపెట్టేదికాదు. అలా ఏళ్లుగా ఊరిస్తోన్న ఐఏఎస్ కల నిన్నటి యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల ద్వారా నెరవేరింది. ఆలిండియా 152వ ర్యాంకు సాధించింది.
వన్మతిది తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం. తండ్రి చెన్నియప్పన్ అద్దె ట్యాక్సీ నడుపుతాడు. తల్లి సుబ్బులక్ష్మీ చిన్నచిన్న పనులు చేసేది. నిజానికి గాసం పోను వన్మతిని ఉన్నత చదువులు చదివించే స్థోమతలేదు ఆ తల్లిదండ్రులకు. అందుకే అమ్మాయి పేరుమీద ఓ బర్రెను కొని, దాని పాలు అమ్మగా విచ్చిన డబ్బుతో వన్మతిని చదివించారు. బర్రె ఆలనాపాలనా వన్మతే చూసుకునేది. ఇప్పటికీ చూసుకుంటోంది.
'సివిల్స్ సాధించడం నా కల. 2011లో మొదటిసారి ట్రై చేశా. ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమయ్యా. రెండోసారి కనీసం ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేదు. మూడోసారి, అంటే 2013లో మెయిన్స్ తప్పా. 2014లో మాత్రం తీవ్రంగా శ్రమించా. 152వ ర్యాంక్ సాధించా. ఇక నా కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుందనే ఫీలింగ్ అన్నింటికన్నా ఎక్కువ ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే నన్ను చదివించడానికి మావాళ్లు పడ్డ కష్టం అంతాఇంతాకాదు. మా నాన్న స్నేహితుడు బాలసుబ్రహ్మణియన్ అంకుల్ ప్రోత్సాహం కూడా మరువలేనిది.
ఇప్పటికీ బర్రెలు కాయడం నాకు చాలా ఇష్టమైనపని. దాన్ని ఆదాయవనరుగా కాకుండా కుటుంబ సభ్యురాలిగా భావిస్తాం. రేప్పొద్దున నేను కలెక్టర్ అయ్యాక బాధపడేది ఏదైనా ఉంటే బహుషా ఇదే అవుతుందేమో' అంటోంది వన్మతి. బీఎస్సీ కంప్యూటర్ టెక్నాలజీలో డిగ్రీచేసిన ఆమె డిస్టెన్స్లో ఎంబీఏ కూడా పూర్తిచేసింది. ప్రస్తుతం ఐఏఎస్ ట్రైనింగ్ కాల్ లెటర్ కోసం ఎదురుచూస్తోంది.