Meet Rinku Singh Rahi 2021 Civils Ranker Who Bond With Sincerity - Sakshi
Sakshi News home page

Rinku Singh Rahi: ‘చచ్చేవరకు ఇలాగే ఉంటా’.. ఈ ఆఫీసర్‌ది మాములు నిజాయితీ కాదు!

Published Thu, Jun 2 2022 2:17 PM | Last Updated on Thu, Jun 2 2022 2:57 PM

Meet Rinku Singh Rahi 2021 Civils Ranker Who Bond With Sincerity - Sakshi

అధికారం చేతిలో ఉంది కదా అని.. అడ్డగోలు అవినీతికి పాల్పడే వాళ్లు ఈ సమాజంలో ఎక్కువ. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఆఫీసర్‌ కథ చాలా ప్రత్యేకం. సమాజం బాగుండాలని ఆలోచించే నిజాయితీ పరుడైన అధికారుల్లో ఈయన ఒకరు. మరి ఆయనకు దక్కిన ప్రతిఫలం..!.. హత్యాయత్నం, వైకల్యం, పిచ్చోడనే ముద్ర. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు కేంద్ర సర్వీసులకు.. అదీ చివరి ప్రయత్నంలోనే అర్హత సాధించాడు మరి!

ఉత్తర ప్రదేశ్‌ హాపూర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ విభాగంలో ఉద్యోగి రింకూ సింగ్‌ రహీ(40).. తాజాగా యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షల్లో 683వ ర్యాంక్‌ దక్కించుకున్నారు. 2008లోనే యూపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను క్లియర్‌ చేశారాయన. అప్పటి నుంచి పలు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఆయన ట్రాక్‌ రికార్డు మాత్రం ఎగుడుదిగుడులతోనే సాగింది. 

2009లో సోషల్‌ వెల్ఫేర్‌ విభాగంలో సుమారు 83 కోట్ల రూపాయల స్కామ్‌ను వెలికి తీశారు రింకూ సింగ్‌ రహీ. ముజఫర్‌నగర్‌లో ఉన్నప్పుడు.. సొంత విభాగంలోనే అవినీతిని.. అందుకు పాల్పడ్డ ఎనిమిది తిమింగలాలను బయటకు లాగి సంచలనం సృష్టించారు. అప్పుడు ఆయన వయసు 26 సంవత్సరాలు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు కూడా. అయితే ఈ మంచి పని.. ఆయనకు శత్రువులను తయారు చేయించింది. 

అవినీతిని వెలికి తీసినందుకు బహుమతిగా ఆయన శరీరంలోకి తుటాలు దిగాయి. ఓరోజు ఆయనపై దాడి జరిగింది. మూడు తుటాలు ముఖాన్ని తీవ్రంగా నాశనం చేశాయి. ఒక కన్ను తీవ్రంగా దెబ్బతింది. కేవలం నలభై రోజుల చికిత్స తర్వాత ఆఘమేఘాల మీద ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతో విధుల్లో చేరారు ఆయన. ఆ ఘటన తర్వాత ఆయన మూడు ప్రాంతాలకు బదిలీ మీద వెళ్లారు.  

రింకూ సింగ్‌ రహీ తండ్రి.. ఓ పిండి మిల్లు నిర్వహకుడు. కుటుంబ ఆర్థిక స్తోమత ఆయనకు తెలుసు. అందుకే కష్టపడి మరీ చదివాడు రింకూ. స్కాలర్‌షిప్‌ మీదే టాటా ఇనిస్టిట్యూట్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. ఆపై యూపీ సర్వీస్‌ కమిషన్‌ జాబ్‌ కొట్టాడు. భారీ కుంభకోణం వెలికి తీశాడు కదా.. అందుకే ఆయనపై ఓసారి హత్యాయత్నం జరిగింది.. మరోసారి ఆమరణ దీక్షకు దిగితే పిచ్చోడనే ముద్ర వేసి మానసిక వికలాంగుల వార్డులోకి చేర్పించారు. అయినా ఆయన అవినీతి పోరాటం ఆపలేదు. 

పలు శాఖల్ని మార్చేసి.. చివరకు బీఆర్‌ అంబేద్కర్‌ ఐఏఎస్‌ ఐపీఎస్‌ కోచింగ్‌ సెంటర్‌కి కో-ఆర్టినేటర్‌గా నియమించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. పిల్లలకు సివిల్స్‌ పాఠాలు చెబుతూ వస్తున్నాడు. అక్కడి విద్యార్థుల ప్రొత్సహాంతోనే చివరి అటెంప్ట్‌.. అదీ 16వ ప్రయత్నంలో సివిల్స్‌ రాశాడు. ర్యాంక్‌ రావడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రింకూ వయసు ఇప్పుడు 40 ఏళ్లు. భార్య, ఓ కొడుకు(8) ఉన్నారు. ఇప్పటికీ ఆయనకు ప్రాణభయం ఉందట. తాను బయటపెట్టిన అవినీతి, నిజాయతీగా చేస్తున్న పోరాటం ఏదో ఒకరోజు తనను బలి తీసుకుంటుందని అంటున్నారాయన. అందుకే కుటుంబం అయినా సంతోషంగా ఉండాలని ఇన్సూరెన్స్‌ కూడా చేయించుకున్నారాయన.

అవినీతి లేని సమాజం ఉండాలనేది ఆయన పోరాటం. అది 14 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. కానీ, ఆ సమాజమే ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ.. పిచ్చోడనే ముద్ర వేసింది. అయినా తాను వెనకడుగు వేయబోనని రింకూ సింగ్‌ రహీ. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement