civils rank
-
పట్టుదల ఉంటే.. కోచింగ్ అక్కర్లే
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పేద, ధనిక తేడాలేదు. ప్రతిభ ఉన్న ఎవరైనా కల నెరవేర్చుకోవచ్చు. ఏ పోటీపరీక్షకైనా ఆన్లైన్లో బోలెడు కంటెంట్, మెటీరియల్ ఉంది. ప్రణాళిక, పట్టుదల ఉంటే కోచింగ్ అక్కర్లేదు. దినపత్రికలు చదవాలి. నోట్స్ తయారు చేసుకోవాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి.’ అని సివిల్స్ విజేత సాయికృష్ణ అన్నారు. కరీంనగర్‌కు తొలిసారిగా వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. లక్ష్యసాధనకు ఏడేళ్ల తపస్సు సివిల్స్ నా చిన్ననాటి కల. దాని కోసం ఏడేళ్లు తపస్సు చేశా. నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. సివిల్స్‌లో 94వ ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు జిల్లాకు కలెక్టర్‌గా సుమితా డావ్రా వచ్చారు. ఆమె గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విని స్ఫూర్తి పొందాను. కరీంనగర్‌పై ఆమె రాసిన ‘పూర్ బట్ స్పిరిటెడ్ కరీంనగర్’ పుస్తకం నాకు ప్రేరణనిచి్చంది. ఆన్లైన్లో మెటీరియల్ ఎక్కువే.. ఇంటర్నెట్లో అన్ని పరీక్షల మెటీరియల్ దొరుకుతుంది.ఆ మెటీరియల్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంగ్లిష్ వస్తేనే సివిల్స్ సాధిస్తామనే అపోహను వీడాలి. మన మాతృభాషలో కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ సైతం మాతృభాషలోనే నిర్వహిస్తారు. కోచింగ్ తీసుకోవాలనే అపోహ, ఇంగ్లిష్ రాదనే భయం వీడితే ఎవరైన సివిల్స్ సాధించవచ్చు. కుటుంబమే పెద్ద అండ సివిల్స్ ప్రిపరేషన్లో కుటుంబ ం అండగా నిలిచింది. నాన్న, మామయ్యలు, అత్తయ్యలు ఎనిమిది మంది వరకు ప్రభుత్వ టీచర్లే.వారి ద్వారా స్ఫూర్తి పొందేవా డిని. 2015లో క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వస్తే చేరకున్నా ఎవరూ ఏమీ అనలేదు.ఇంటికే పేపర్ వస్తుండడంతో చిన్నప్పటి నుంచే దినపత్రికలు చదవడం అలవాటుగా మారింది. ఈ అలవాటు సివిల్స్‌కు ఎంతో ఉపయోగపడింది. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నా.. వరంగల్ ఎన్ఐటీలో 2015లో బీటెక్ పూర్తయ్యింది. ఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోచింగ్ తీసుకున్న. సొంతంగా నోట్స్ త యారు చేసుకున్న. 2017 సివిల్స్‌లో 728వ ర్యా ంకుతో ఐసీఎల్ఎస్ వచ్చింది. నా లక్ష్యం ఐఏఎస్ కావడంతో మళ్లీ ప్రిపేర్ అయ్యాను. రోజుకు 5 నుంచి 7 గంటలు చదివాను. ఈ క్రమంలో మా సీనియర్ తక్కల్లపల్లి యశ్వంత్‌రావు ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి. సోషల్ మీడియాకు దూరం సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నాను. కంటెంట్ కోసమే ఆన్లైన్లో సెర్చ్ చేశాను. లక్ష్య సాధనకు అవసరమైన సమాచారం కోసమే యూ ట్యూబ్, గూగుల్‌లో సెర్చ్ చేశాను. అది నాకు ఎంతగానో ఉపయోగపడింది. అప్పుడప్పుడు సినిమాలు కూడా చూశాను. కానీ పరిమితంగానే చూశాను. ఈ కాలం తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాల దశలోనే ఐఏఎస్, ఐఐటీ కోర్సులు అంటూ నేర్పిస్తున్నారు. ఇది కొంత ఇబ్బందికరమే. పాఠశాల, ఇంటర్ స్థాయిలో ఐఐటీ, ఐఏఎస్ కోచింగ్‌లు ఇప్పించడం సరికాదు. ప్రతీ విద్యార్థి తనకంటూ ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. అది తెలుసుకొని అటువైపు వెళ్తే సక్సెస్ అవుతారు. అయితే కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవడం ప్రతీ విద్యార్థికి అవసరమే. ఏ పోటీ పరీక్షలోనైన కరెంట్ అఫైర్స్‌పై పట్టు ఉంటేనే రాణించగలుగుతారు. తన కలనే మా కల సాయి చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెరిగాడు. అందుకోసం నిరంతరం శ్రమించాడు. తన కలను మా కలగానే అనుకుని అన్ని విధాలా సహకరించాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతను అడిగినవన్నీ సమకూర్చాం. 2017లోనే ఐసీఎల్ఎస్ వచ్చినా సంతృప్తి చెందలేదు. తన స్వప్నం సాకారం కోసం రాత్రింబవళ్లు శ్రమించాడు. చివరికి సాధించాడు. – ఆవుల లక్ష్మయ్య ప్రైవేటు ఉద్యోగాన్ని వదులుకున్నాడు 2015లోనే నా కుమారుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్టయ్యాడు. తల్లిదండ్రులుగా మేమెంతో ఆనందపడ్డాం. ఆకర్షణీయమైన ప్యాకేజీ చేతికి అందినా పక్కనబెట్టాడు. తన కలల వైపు అడుగులేశాడు. చివరికి నా కొడుకు తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ రోజు ఇంకా సంతోషిస్తున్నాం. – ఆవుల సునీత -
మధ్య తరగతి కుటుంబంలో మెరిసిన విద్యాకుసుమం
బోధన్‌టౌన్(బోధన్) : మంచి చదువు చదివి ఉన్నత హోదాలో ఉండాలని చిన్నప్పటి నుంచి నాన్న చెప్పిన మాటలతోనే తాను స్ఫూర్తి పొంది కలెక్టర్ కావాలని సంకల్పించానని సివిల్స్ ఆలిండియా 200 ర్యాంకర్ కంటం మహేశ్‌కుమార్ తెలిపారు. నాన్నే తనకు మంచి మోటివేటర్ అన్నారు. బోధన్ పట్టణానికి చెందిన కంటం రాములు, యాదమ్మల మొదటి సంతానం మహేశ్‌కు మార్. వీరిది మధ్య తరగతి కుటుంబం. రాములు విద్యుత్ శాఖలో సీనియర్ లైన్‌మన్‌గా వేల్పూర్‌లో విధులు నిర్వహిస్తుండగా, యాదమ్మ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హెల్త్ సూర్ వైజర్‌గా పని చేస్తున్నారు. తన ఐఏఎస్ ప్రిపరేషన్‌కు అమ్మనాన్నలతో పాటు భార్య సౌమ్య తన సహకారాన్ని అందించారని చెబుతు న్నారు. సివిల్స్‌లో ర్యాంకుతో తనకు ఫారెన్ సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్‌లలో ఏదోఒకటి వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. అనాథ పిల్లలకు ఇవ్వమనే వాడు చిన్న నాటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. నవోదయలో సీటు సాధించడం ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందాన్ని సివిల్స్‌లో ర్యాంకు సాధించే వరకు సాగించాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నావు. కోచింగ్ తీసుకొమ్మని అడిగితే ఆడబ్బులను అనాథ ఆశ్రమాలకు, అనాథ పిల్లలకు ఇవ్వండి అని చెప్పేవాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి సంతోషాన్ని పంచాడు. –యాదమ్మ, తల్లి పట్టలేనంత సంతోషంగా ఉంది నా కొడుకు సివిల్స్‌లో ర్యాంకు సాధించడం పట్టలేనంత సంతోషంగా ఉంది. విద్యపై మక్కువతో ఉన్నత విద్యను అభ్యసించాడు. చిన్న నాటి నుంచి కలెక్టర్ అవుతానని చెప్పిన మాటలను సాకారం చేశాడు. – కంటం రాములు, తండ్రి -
సీఎం జగన్‌ను కలిసిన సివిల్స్ సర్వీసెస్ విజేతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021కి ఎంపికైన విజేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు వాళ్లు. ఏపీ నుంచి సివిల్ సర్వీసులకు ఎంపికైన ఆ అభ్యర్ధులతో ముచ్చటించి, పేరుపేరునా వారిని అభినందించారు సీఎం జగన్. ఈసారి సివిల్స్ విజేతల్లో.. నంద్యాలకు చెందిన యశ్వంత్ రెడ్డికి 15వ ర్యాంకు లభించడం విశేషం. విశాఖకు చెందిన పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంకు, నర్సీపట్నంకు చెందిన మౌర్య భరద్వాజ్ కు 28, కాకినాడ అమ్మాయి కొప్పిశెట్టి కిరణ్మయికి 56, భీమవరంకు చెందిన శ్రీపూజకు 62వ ర్యాంకు, విజయవాడకు చెందిన గడ్డం సుధీర్ కుమార్ రెడ్డికి 69వ ర్యాంకు, నగరికి చెందిన మాలెంపాటి నారాయణ అమిత్ కు 70, రాజమండ్రికి చెందిన తరుణ్ పట్నాయక్ కు 99వ ర్యాంకు వచ్చాయి. క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021 కి ఎంపికైన అభ్యర్ధులు. వారిని అభినందించిన ముఖ్యమంత్రి. pic.twitter.com/UpWuCHkgKp — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 13, 2022 -
సివిల్స్ ర్యాంకర్‌కు సన్మానం.. అంతలోనే ఆవిరైన ఆనందం
ఒక క్రేన్ ఆపరేటర్ కూతురు.. రోజుకు 18 గంటలపాటు కష్టపడింది. స్మార్ట్‌ఫోన్ ప్రిపరేషన్, అరకోర పుస్తకాలతో.. అందునా తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్ కొట్టింది. పైగా ఆల్ ఇండియాలో 323వ ర్యాంక్ సాధించింది. ఈ కథ స్ఫూర్తిని ఇచ్చేదే. కానీ, ఇక్కడో ట్విస్ట్ ఆ అమ్మాయి ఆనందాన్ని ఆవిరి చేసింది. జార్ఖండ్ రామ్‌గడ్‌కు చెందిన దివ్య పాండే(24).. 2017లో రాంచీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ర్యాంక్ సాధించడంతో ఆమెను మెచ్చుకోని వాళ్లంటూ లేరు. ఆమె తండ్రి సెంట్రల్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. కోచింగ్ లేకుండానే ఆమె ఈ ఘనత సాధించడంతో.. మీడియా కూడా జోరుగా కథనాలు వచ్చాయి. అయితే.. ఆమె ఆనందం ఇప్పుడు ఆవిరైంది. ర్యాంక్ వచ్చింది ఆమెకు కాదని స్పష్టత వచ్చింది. దివ్య పాండే అక్క ప్రియదర్శిని పాండేకు యూపీకి చెందిన ఓ స్నేహితురాలు.. ఫోన్ చేసి ఫలానా దివ్య పాండేకు సివిల్స్ ర్యాంక్ వచ్చిందని చెప్పిందట. దీంతో ఆ దివ్య తన సోదరే అనుకుంది ఆమె. ఈ క్రమంలో ఇంటర్నెట్లో ఫలితాల కోసం సెర్చ్చేయగా.. ఆ టైంకి ఇంటర్నెట్ పని చేయలేదని చెబుతోంది ఆ కుటుంబం. అయినా ఆలోచించకుండా ర్యాంక్ వచ్చింది తమ బిడ్డకే అనుకుని ఆ కుటుంబం సంబురాలు చేసుకుంది. స్థానికులకు స్వీట్లు పంచుకుంది. ఈ విషయం మీడియాకు సైతం చేరింది. దివ్య పాండే తండ్రి జగదీశ్ ప్రసాద్ పాండే 2016లో సెంట్రల్ కోలార్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) నుంచి క్రేన్ ఆపరేటర్‌గా రిటైర్ అయ్యాడు. దీంతో ఆ తండ్రి కష్టం ఫలించిందని అంతా అనుకున్నారు. విషయం తెలిసిన సీసీఎల్ అధికారులు, జిల్లా పాలనా సిబ్బంది దివ్య పాండేను పిలిపించుకుని ఘనంగా సత్కారం చేశారు. అయితే ర్యాంకు వచ్చిన ఆనందంలో ఢిల్లీకి చేరిన ఆ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాంక్ వచ్చింది జార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లా చిట్టాపూర్‌లోని రాజ్రప్ప కాలనీకి చెందిన దివ్య పాండేకి కాదని అధికారులు చెప్పారు. ఆ ర్యాంక్ దక్షిణ భారత్‌కు చెందిన దివ్య పీ అనే అమ్మాయిది అని చెప్పడంతో ఆ కుటుంబం నిరాశగా వెనుదిగింది. అంతేకాదు ఈ పొరపాటుకు అందరికీ క్షమాపణలు చెబుతోంది. మరోవైపు ఈ తప్పిదం ఆధారంగా ఆ కుటుంబంపై ఎలాంటి చర్యలు ఉండబోవని అధికారులు చెప్తున్నారు. -
‘చచ్చేవరకు ఇలాగే ఉంటా’.. ఓ సిన్సియర్ ఆఫీసర్ కథ
అధికారం చేతిలో ఉంది కదా అని.. అడ్డగోలు అవినీతికి పాల్పడే వాళ్లు ఈ సమాజంలో ఎక్కువ. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఆఫీసర్ కథ చాలా ప్రత్యేకం. సమాజం బాగుండాలని ఆలోచించే నిజాయితీ పరుడైన అధికారుల్లో ఈయన ఒకరు. మరి ఆయనకు దక్కిన ప్రతిఫలం..!.. హత్యాయత్నం, వైకల్యం, పిచ్చోడనే ముద్ర. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు కేంద్ర సర్వీసులకు.. అదీ చివరి ప్రయత్నంలోనే అర్హత సాధించాడు మరి! ఉత్తర ప్రదేశ్ హాపూర్ సోషల్ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగి రింకూ సింగ్ రహీ(40).. తాజాగా యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో 683వ ర్యాంక్ దక్కించుకున్నారు. 2008లోనే యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను క్లియర్ చేశారాయన. అప్పటి నుంచి పలు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఆయన ట్రాక్ రికార్డు మాత్రం ఎగుడుదిగుడులతోనే సాగింది. 2009లో సోషల్ వెల్ఫేర్ విభాగంలో సుమారు 83 కోట్ల రూపాయల స్కామ్‌ను వెలికి తీశారు రింకూ సింగ్ రహీ. ముజఫర్‌నగర్‌లో ఉన్నప్పుడు.. సొంత విభాగంలోనే అవినీతిని.. అందుకు పాల్పడ్డ ఎనిమిది తిమింగలాలను బయటకు లాగి సంచలనం సృష్టించారు. అప్పుడు ఆయన వయసు 26 సంవత్సరాలు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు కూడా. అయితే ఈ మంచి పని.. ఆయనకు శత్రువులను తయారు చేయించింది. అవినీతిని వెలికి తీసినందుకు బహుమతిగా ఆయన శరీరంలోకి తుటాలు దిగాయి. ఓరోజు ఆయనపై దాడి జరిగింది. మూడు తుటాలు ముఖాన్ని తీవ్రంగా నాశనం చేశాయి. ఒక కన్ను తీవ్రంగా దెబ్బతింది. కేవలం నలభై రోజుల చికిత్స తర్వాత ఆఘమేఘాల మీద ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతో విధుల్లో చేరారు ఆయన. ఆ ఘటన తర్వాత ఆయన మూడు ప్రాంతాలకు బదిలీ మీద వెళ్లారు. రింకూ సింగ్ రహీ తండ్రి.. ఓ పిండి మిల్లు నిర్వహకుడు. కుటుంబ ఆర్థిక స్తోమత ఆయనకు తెలుసు. అందుకే కష్టపడి మరీ చదివాడు రింకూ. స్కాలర్షిప్ మీదే టాటా ఇనిస్టిట్యూట్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఆపై యూపీ సర్వీస్ కమిషన్ జాబ్ కొట్టాడు. భారీ కుంభకోణం వెలికి తీశాడు కదా.. అందుకే ఆయనపై ఓసారి హత్యాయత్నం జరిగింది.. మరోసారి ఆమరణ దీక్షకు దిగితే పిచ్చోడనే ముద్ర వేసి మానసిక వికలాంగుల వార్డులోకి చేర్పించారు. అయినా ఆయన అవినీతి పోరాటం ఆపలేదు. పలు శాఖల్ని మార్చేసి.. చివరకు బీఆర్ అంబేద్కర్ ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్‌కి కో-ఆర్టినేటర్‌గా నియమించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. పిల్లలకు సివిల్స్ పాఠాలు చెబుతూ వస్తున్నాడు. అక్కడి విద్యార్థుల ప్రొత్సహాంతోనే చివరి అటెంప్ట్.. అదీ 16వ ప్రయత్నంలో సివిల్స్ రాశాడు. ర్యాంక్ రావడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రింకూ వయసు ఇప్పుడు 40 ఏళ్లు. భార్య, ఓ కొడుకు(8) ఉన్నారు. ఇప్పటికీ ఆయనకు ప్రాణభయం ఉందట. తాను బయటపెట్టిన అవినీతి, నిజాయతీగా చేస్తున్న పోరాటం ఏదో ఒకరోజు తనను బలి తీసుకుంటుందని అంటున్నారాయన. అందుకే కుటుంబం అయినా సంతోషంగా ఉండాలని ఇన్సూరెన్స్ కూడా చేయించుకున్నారాయన. అవినీతి లేని సమాజం ఉండాలనేది ఆయన పోరాటం. అది 14 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. కానీ, ఆ సమాజమే ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ.. పిచ్చోడనే ముద్ర వేసింది. అయినా తాను వెనకడుగు వేయబోనని రింకూ సింగ్ రహీ. -
సివిల్స్‌లో ఐశ్వర్యకు నాలుగో ర్యాంకు... అయితే ఐశ్వర్య అమ్మాయి కాదు!
న్యూఢిల్లీ: సివిల్స్ నాలుగో ర్యాంకర్ ఐశ్వర్య వర్మ పేరు చాలామందిలో అయోమయానికి కారణమైంది. తొలి మూడు ర్యాంకులూ మహిళలే కైవసం చేసుకున్న నేపథ్యంలో, పేరు చూసి ఐశ్వర్య అంటే అమ్మాయేనని చాలామంది అనుకున్నారు. పలు పత్రికల్లోనూ, వెబ్సైట్లలోనూ కూడా అలాగే వచ్చింది. తొలి నాలుగు ర్యాంకులూ అమ్మాయిలే సాధించారంటూ అవన్నీ రాసుకొచ్చాయి. సివిల్స్ నాలుగో ర్యాంకర్ ఐశ్వర్య వర్మ (ఫైల్) మహిళా సాధికారత మరో మెట్టు పైకెక్కిందంటూ వాట్సాప్, ఫేస్బుక్, ట్వీటర్లలో పోస్టులు వెల్లువెత్తాయి. దాంతో ఐశ్వర్య మహిళ కాదంటూ ఆయన కుటుంబీకులు, స్నేహితులు స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది! సోషల్ మీడియాలో ఆయన ఫొటో పెట్టి మరీ విషయం వివరించారు. పత్రికలు, సైట్లు ఇలా గందరగోళపడ్డా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం ‘ఉజ్జయినికి చెందిన పురుష అభ్యర్థి ఐశ్వర్య వర్మ నాలుగో ర్యాంకు సాధించారు’ అంటూ స్పష్టంగా పేర్కొంటూ ప్రశంసించారు. ఐశ్వర్య వర్మ ఢిల్లీలో నాలుగేళ్ల పాటు కోచింగ్ తీసుకుని, నాలుగో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు సాధించారు! చదవండి: రిటైర్మెంట్లో రికార్డు.. ఒకే రోజు 25 వేల మంది ఇంటిబాట! -
పృథ్వీతేజ్ సంకల్పం.. వైఎస్ జగన్ ప్రశంసలు
సాక్షి, ద్వారకాతిరుమల: ప్రజలకు సేవ చేయాలన్న ఆ యువకుడి సంకల్పం.. రూ.కోటి జీతాన్ని వదులుకునేలా చేసింది. పట్టుదలతో తాను ఎంచుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించి తొలి ప్రయత్నంలో ఐఏఎస్ అయిన ఆ యువకుడు అందరికీ ఆదర్శంగా నిలిచారు. కన్నవారికి, పుట్టిన గడ్డకు మంచి పేరు తెచ్చి, ఇటీవల కడప జిల్లాలో రెవెన్యూ డివిజన్ సబ్‌కలెక్టర్‌గా పోస్టింగ్ పొందిన ద్వారకాతిరుమలకు చెందిన యిమ్మడి పృథ్వీతేజ్ విజయగాథ.. సివిల్స్‌లో 24వ ర్యాంక్ బంగారు నగల వ్యాపారి యిమ్మడి శ్రీనివాసరావు, రాణి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఏకైక కుమారుడు పృథ్వీతేజ్ చిన్ననాటి నుంచి చదువులో రాణించారు. ప్రజాసేవ చేసే ఉన్నత ఉద్యోగం చేయాలనే లక్ష్యాన్ని చిన్నతనంలో ఎంచుకున్నారు. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ లక్ష్య సాధనవైపు దూసుకెళ్లారు. 24 ఏళ్ల వయసులోనే సివిల్స్‌లో 24వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్)కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న ఆయన ఇటీవల కడప జిల్లా రెవెన్యూ డివిజన్ సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ పొందారు. కుటుంబసభ్యులతో పృథ్వీతేజ్ జగన్ ప్రశంసలు పొంది.. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో 2018 మే 19న ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పృథ్వీతేజ్, ఆయన తండ్రి శ్రీనివాసరావు కలుసుకున్నారు. అప్పటికే సివిల్స్‌లో సత్తాచాటిన పృథ్వీతేజ్ను జగన్మోహన్రెడ్డి అభినందించారు. రూ.కోటి ప్యాకేజీని వదులుకుని.. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే సౌత్ కొరియాలోని సామ్సంగ్ కంపెనీలో ఏడాదికి రూ.కోటి ప్యాకేజీతో ఏడాదిపాటు పృథీ్వతేజ్ ఉద్యోగం చేశారు. అయితే ఉద్యోగం, సంపాదన ఆయనకు సంతృప్తి కలిగించలేదు. తాను కోరుకున్నది సాధించాలన్న దృఢ సంకల్పంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టి సివిల్స్ దిశగా అడుగులు వేశారు. కుటుంబసభ్యులతో పృథ్వీతేజ్ విద్యాభ్యాసం పృథ్వీతేజ్ 3వ తరగతి వరకు ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట సెయింట్ గ్జేవియర్ పాఠశాలలో, ఆ తర్వాత 6వ తరగతి వరకు డీపాల్ పాఠశాలలో చదివారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్ గూడవల్లి శ్రీచైతన్య కళాశాలలో చదువుతూ 2011లో ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఆల్ఇండియా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముంబైలో ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కోచింగ్ తీసుకోకుండానే.. ఐఏఎస్ సాధించేందుకు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే పృథ్వీతేజ్ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. పట్టుదలతో చదివి, పరీక్ష రాసిన ఆయన 2018లో విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియాలో 24వ ర్యాంక్‌ను సాధించారు. ఐఐటీలో ర్యాంకు సాధించిన పృథ్వీతేజ్ అనతికాలంలోనే సివిల్స్‌లో సత్తాచాటుతారని ఎవరూ ఊహించలేదు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం గెలుపును ముందే ఊహించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, నమ్మకం, పృథ్వీతేజ్ పట్టుదల, కృషి ఆయన్ను ఈస్థాయిలో కూర్చోబెట్టింది. -
నీట గెలిచిన నిప్పు
కింద నీటిలో చూస్తూ ధనుస్సుతోపైన మత్స్యయంత్రాన్ని కొడతాడు అర్జునుడు!నాలుగు చినుకులు పడితే నీట మునిగేఇంటిలో ఉంటూ సివిల్స్‌లో ర్యాంక్ కొట్టింది శ్రీధన్య. పేదరికాన్ని ఈదేందుకు చదువును లైఫ్‌బోట్‌గా చేసుకున్న ఈ అమ్మాయి ఒక కష్టం పడలేదు. అలాగని ఇష్టమైన కలను కనడమూ మానలేదు! ‘‘సాధారణంగా వరదలు అంటే అందరూ భయపడతారు. అయితే మాకు వరదలు చాలా సాధారణం. ఒకవిధంగా చెప్పాలంటే వానాకాలంలో నిత్యం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చునే తిథుల్లాంటివి’’ అంటారు శ్రీధన్య తల్లి కమల. శ్రీధన్య కేరళలో ఆదివాసీ తెగ నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన మొట్టమొదటి విద్యార్థిని. ‘‘మా అమ్మాయి చదువుకునే పుస్తకాలు కనీసం రెండు సంచులైనా గత ఏడాది వచ్చిన వరదల్లో కొట్టుకుపోయాయి. అయినా సరే.. ఆమె జీవితాశయాన్ని, సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్న ఆమె ఆశను అవి ఆపలేకపోయాయి’’ అని కమల కొద్దిపాటి గర్వంతో కూడిన సంతోషంతో చెబుతారు. గత ఆగస్ట్‌లో కేరళలో సంభవించిన వరదలు ఈ శతాబ్దిలోనే అత్యంత భయంకరమైనవిగా పేరు పొందాయి. ఈ వరద బీభత్సం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో బాటు వీరుండే ఇడియమ్వాయల్నూ కుదిపి వేసింది. గాలీవానా, దానికితోడు వరద తాకిడికి జనజీవనం అతలాకుతలమైంది. ఈ వరదల గురించి అడిగినప్పుడు కమల ముఖంలో కొద్దిపాటి విచారం ప్రస్ఫుటమయింది. ‘‘వరదలు మాకు కొత్తేమీ కాదు. ఇంచుమించు ప్రతి రుతువులోనూ వస్తుంటాయి. మా ఇంటి కప్పులు కారకుండా ప్లాస్టిక్ సామాను అడ్డుపెట్టడం తప్ప మరేమీ తేడా లేదు’’ అన్నారావిడ నిర్లిప్తంగా నవ్వుతూ. కేరళలోని ఒక వెనుకబడిన జిల్లాలో, అదీ ఆదివాసీలు అధికంగా కనిపించే ఓ కుగ్రామంలో వరదల గురించి ఇటువంటి మాటలు వినరావడం మామూలే. అయితే కమల ఈ మాటలు చెప్పారంటే, కచ్చితంగా ఆలోచించి తీరాల్సిందే. ఎందుకంటే, ఆమె సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణత సాధించిన మొట్టమొదటి విద్యార్థిని శ్రీధన్య తల్లి కాబట్టి. సివిల్ సర్వీస్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా సెలక్టయిన 759 పేర్లు ఉన్న జాబితాలో శ్రీధన్యది నాలుగు వందల పదవ ర్యాంకు. చినుకు పడితే కప్పునుంచి నీళ్లు కారి, చిత్తడి చిత్తడి అయ్యే ఇంటిలో ఉండే శ్రీధన్య ఈ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైందని తెలిస్తే మాత్రం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆమె తలిదండ్రులిద్దరూ రోజు కూలీలే, రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులే కావడం వల్ల తమ ముగ్గురు పిల్లలూ చాలీ చాలని గుడ్డిదీపపు వెలుగులో కళ్లు చికిలించి మరీ చదువుకుంటుంటే వారిని బాధతో చూడటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయులు వారు. ఆ పాటి గుడ్డిదీపాలు కూడా నాలుగైదేళ్ల నుంచే ఆ ఇంటిలో వెలుగుతున్నాయి. అంతకుముందు ఆముదం దీపాలే ఆ ఇంటి చీకట్లను పారద్రోలడానికి విశ్వప్రయత్నం చేసేవి. ఆ ఇంటిలోనే పాత చీరలు, ఉన్ని ఉండలే గోడలుగా పార్టిషన్ చేసుకుని దానిని తన గదిగా మార్చుకుంది శ్రీధన్య. అందులోనే ఆమె చదువు. బాల్యంలో కూడా శ్రీధన్య, ఆమె అక్క, తమ్ముడు ముగ్గురూ కాలినడకనే బడికి వెళ్లేవారు. దాదాపు 4 కిలోమీటర్లకు పైగా నడిచి మరీ స్కూలుకి చేరుకునేవారు. టెంత్ క్లాస్ వరకూ ఆ స్కూల్లోనే చదివిన శ్రీధన్య.. ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నీ కూడా తన ప్రతిభతో ఉచితంగా చదువుకోగలిగింది. ‘‘ఒక్క శ్రీధన్యే కాదు, మా పిల్లలందరినీ కూడా సరస్వతీ దేవి చల్లగా చూసింది. చదువులో వాళ్లు తెచ్చుకున్న మార్కులే వాళ్లకి స్కాలర్షిప్లు సంపాదించి పెట్టేవి. వాటితోనే మా కుటుంబం నాలుగు మెతుకులు తినగలిగింది. నిజానికి మా పిల్లలని చెప్పుకోవడం కాదు గానీ, వాళ్లని చదివించడానికి మేము చేసిందేమీ లేదండీ, వాళ్లే కష్టపడి చదువుకున్నారు’’ అన్నారు శ్రీధన్య తండ్రి సురేశ్. ‘‘కాలేజీకి పంపించేందుకు నా దగ్గర పైసా కూడా డబ్బులేనివాడిని. ఇక నేను తనకి ల్యాప్‌టాప్ ఏమి కొనిపెడతాను? అది కూడా శ్రీధన్యే తన స్కాలర్ షిప్పుతోనే కొనుక్కుంది. కోళికోడ్‌లోని దేవగిరి కాలేజీలో చేరి, హాస్టల్ ఫీజు, మెస్సు బిల్లులు కూడా తనే కట్టుకుంది. ఈ ర్యాంకు సాధించిందంటే అంతా ఆమె కష్టమే. అసలు ఇప్పుడు తన రిజల్ట్ వచ్చాక అభినందనలకు ప్రతిస్పందనగా నమస్కరించాలన్నా ఆమె చేతులు సహకరించడం లేదు. ఎందుకంటే, ఆమె తన ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో షాక్ కొట్టింది. మోచేతి దాకా కాస్త బలహీనపడింది’’ అంటూ కంటతడి పెట్టుకున్నారు సురేష్. ఇక శ్రీధన్య తమ్ముడు విశాల్.. ‘‘ఎన్ని కష్టాలున్నా వాటినుంచి బయటపడటం ఎలాగో తనను చూసే నేర్చుకున్నాను’’ అంటాడు. ‘‘తను ఎంత సున్నిత మనస్కురాలంటే, తనకు ఎంత ఇబ్బంది ఉన్నా గానీ, మేము బాధపడతామని నోరు విప్పి చెప్పుకోలేదెప్పుడూ. అంతేకాదు, తను ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది’’ అంటాడు.కురిచ్య తెగ సంప్రదాయం ప్రకారం శ్రీధన్య ఇంటి ముందు విల్లు, బాణాలు ఎక్కుపెట్టి ఉంటాయి. ఆ సమీపంలోనే స్ఫూర్తి కోసం టార్గెట్ బోర్డ్ అమర్చుకుంది శ్రీధన్య. చివరికి తన లక్ష్యాన్ని సాధించింది కృష్ణ కార్తీక కల నిజమైంది కనిష్క్ కటారియా, శ్రుతి జయంత్ దేశ్‌ముఖ్.. ఈ ఇద్దరు గత ఐదురోజులుగా వార్తపత్రికల్లో, టీవీల్లో కనిపిస్తున్నారు. యూపీఎస్సీ గత శుక్రవారం ప్రకటించిన 2018 సివిల్ సర్వీసు ఫలితాలలో కనిష్క్, శ్రుతి టాపర్లుగా నిలిచారు. అయితే వీళ్లకంటే ఎక్కువగా ఒక నిరుపేద ఆదివాసీ ప్రతిభామూర్తి గురించి విద్యార్థిలోకం చెప్పుకుంటోంది. ఆ ప్రతిభామూర్తి పేరు శ్రీధన్య. సివిల్స్‌లో 410 ర్యాంకు సాధించి కేరళలోని ఆదివాసీ తెగ నుంచి తొలిసారి ఇలాంటి ఒక విజయాన్ని సాధించిన యువతిగా శ్రీధన్య పేరు మారుమోగిపోతోంది. శ్రీధన్యది వేయనాడ్ జిల్లాలోని ఉడియంవయాల్ గ్రామం. కురిచ్య తెగ. శ్రీధన్యకు ర్యాంకు వచ్చిందని తెలియగానే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెను అభినందించారు. ‘‘సామాజిక పరిస్థితులతో పోరాడి సివిల్స్‌లో అతి పెద్ద విజయాన్ని సాధించిన శ్రీధన్యకు అభినందనలు’’ అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. కేరళ ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి కె.కె. శైలజ.. ‘‘వేయనాడ్ ప్రజలకు ఇదొక చరిత్రాత్మక క్షణం. కేరళ చరిత్రలోనే తొలిసారిగా ఒక ఆదివాసీ అమ్మాయి సివిల్స్‌లో విజయం సాధించింది’’ అని ప్రశంసించారు. 25 ఏళ్ల శ్రీధన్య సాధించిన ఈ ఘనతకు అందరికన్నా ఎక్కువగా సంతోషిస్తున్నది మాత్రం ఆమె కుటుంబ సభ్యులే. మూడో ప్రయత్నంగా ఆమె ఈ విజయాన్ని సాధించారు. దినసరి కూలీ కుమార్తె అయిన శ్రీధన్య అప్లయిడ్ జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సివిల్స్ మెయిన్స్‌లో మలయాళ సాహిత్యాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. ర్యాంకుతో తనకు గుర్తింపు రావడంపై మాట్లాడుతూ, తమ తెగలోని మిగతా అమ్మాయిలకు ఈ విజయం ఒక స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. 2016లో పీజీ పూర్తయ్యాక, శ్రీధన్య రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో ప్రాజెక్టు అసిస్టెంటుగా పని చేశారు. అప్పుడే ఆమె∙సివిల్స్ వైపు మొగ్గచూపారు. నిజానికి అది ఆమె కల కూడా. ఆ కలను మొత్తానికి నిజం చేసుకున్నారు. -
సివిల్స్‌లో మెరిసిన గిరిజన వజ్రం
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): చదువుకు పేదరికం అడ్డుకాదు.. సాధించాలనే లక్ష్యం, తపన ఉంటే కష్టపడి తత్వం ఉంటే విజయ తీరాలను అందుకోవచ్చని నిరూపించాడు గ్రామీణ ప్రాంత విద్యార్థి ప్రవీణ్ నాయక్. సివిల్ సర్వీసెస్–2018 ఫలితాల్లో వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబల్లికి చెందిన నునావత్ ప్రవీణ్‌నాయక్ 610 ర్యాంక్‌ను సాధించాడు. నునావత్ భీమా నాయక్–రాజమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారి కుమారుడు ప్రవీణ్ నాయక్ ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు కరీంనగర్‌లోని పారమిత హైస్కూల్లో చదువుకున్నాడు. పదో తరగతి పూర్తికాగానే 2008 సంవత్సరం హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్(ఎంపీసీ), అనంతరం వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో బీటెక్ పూర్తి కాగానే ఢిల్లీలో కొన్ని నెలల పాటు కోచింగ్ తీసుకున్న ప్రవీణ్ నాయక్ 2016 సివిల్స్ మెయిన్స్‌లో తప్పాడు. రెండో ప్రయత్నంలో లక్ష్యం సాధించాడు. 2018 సంవత్సరానికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ కమిషన్) గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ సివిల్స్ మెయిన్స్ పరీక్షలను, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటర్వూలు నిర్వహించగా అందులో ప్రవీణ్నాయక్కు 610 ర్యాంక్ సాధించాడు. సంతోషంగా ఉంది.. నా కుమారుడు సివిల్స్ సాధించడం చాల సంతోషంగా ఉంది. మాది చాలా పేద కుటుంబం. మా తండాల్లో ఎర్రమట్టి విక్రయాలే జీవనాధారం. మా తండ్రి నునావత్ బిక్యా–బూలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నాన్న ఎర్రమట్టి అమ్మి వచ్చిన డబ్బులతో నన్ను చదివించాడు. ప్రస్తుతం మా ఇద్దరు తమ్ముళ్లలో ఒకరు ఆటో డ్రైవర్‌గా, మరో తమ్ముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నేను పదో తరగతి వరకు ముల్కనూర్‌లో చదువుకున్నాను. 1996 సంవత్సరంలో ఓరియంటల్ బ్యాంక్ కామర్లో ఫ్యూన్‌గా ఉద్యోగం లభించింది. నాకు కుమారుడు ప్రవీణ్‌తో పాటుగా కూతురు నవ్య సంతానం. నవ్య ఇప్పుడు డిగ్రీ చదువుతోంది. – భీమా నాయక్, ప్రవీణ్ నాయక్ తండ్రి పేపర్ చదవడం వల్లే సివిల్స్ సాధించాను.. మాది పేద కుటుంబం.. సివిల్స్ చదవాలనే తపన ఇంటర్మీడియట్లోనే కలిగింది. అప్పటి నుంచి అందే సంకల్పంతో బీటెక్ పూర్తి కాగానే సివిల్స్‌పై దృష్టి సారించి ఢిల్లీలో కోచింగ్‌కు వెళ్లాను. అయిప్పటికీ స్వతహాగా నోట్స్ తయారు చేసుకున్నాను. ఇతర పుస్తకాలతోపాటు నిత్యం పేపర్ చదివాను. సివిల్స్ సాధించడానికి ఇవి తోడ్పడ్డాయి. పేపర్ చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. నిత్యం 8 నుంచి 10 గంటలు ప్రిపేరయ్యాను. ఆశయం ఉంటే లక్ష్యం సాధించడం కష్టమేమి కాదు. – నునావత్ ప్రవీణ్ నాయక్ -
సివిల్స్ టాపర్ మార్కులు 55.6 శాతం
న్యూఢిల్లీ: 2017లో సివిల్స్‌కు ఎంపికైన వారి మార్కులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం విడుదల చేసింది. అత్యంత కఠినంగా ఉండే సివిల్స్‌లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ తెలుగు విద్యార్థి దురిశెట్టి అనుదీప్ 55.60 శాతం మార్కులు సాధించాడు. సివిల్స్ మెయిన్స్ 1,750 మార్కులు, ఇంటర్వ్యూ 275 కలిపి మొత్తం 2,025 మార్కులకు.. అనుదీప్ రాతపరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176 మార్కులతో మొత్తం 1,126 మార్కులు సాధించాడు. రెండో ర్యాంకు సాధించిన అను కుమారి 1,124 (రాత పరీక్షలో 937, ఇంటర్వ్యూలో 187) మార్కులతో 55.50%, మూడో ర్యాంకర్ సచిన్ గుప్తా 55.40 శాతం (946 రాతపరీక్ష, ఇంటర్వ్యూలో 176) మార్కులు సాధించారు. ఈ పరీక్షల్లో 750 మంది పురుష, 240 మహిళా అభ్యర్థులు మొత్తం 990 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు అర్హత సాధించినట్లు యూపీఎస్సీ పేర్కొంది. 990వ ర్యాంకు సాధించిన హిమాంక్షి భరద్వాజ్ 830 మార్కుల (687 రాతపరీక్ష, 143 ఇంటర్వ్యూ)తో 40.98శాతం సాధించాడు. -
సివిల్స్ సాధించిన అభ్యర్థికి వైఎస్ జగన్ ఫోన్
సాక్షి, మచిలీపట్నం : సివిల్స్‌లో 512వ ర్యాంకు సాధించిన అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. మొన్న ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్ చంద్ 512వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా గురువారం వైఎస్ జగన్.. ప్రవీణ్ చంద్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఐఐటీ పాట్నాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రవీణ్ చంద్ 2016 సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అవకాశం రాలేదు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తాత్కాలికంగా విరామం ఇచ్చి సివిల్స్ సాధించారు. నలుగురికి సేవ చేయాలనే తాను సివిల్స్ రాసినట్టు ప్రవీణ్ చంద్ తెలిపారు. వైఎస్ జగన్ ఫోన్ చేసి అభినందనలు తెలపడం చాలా ఆనందంగా ఉందని ప్రవీణ్ అన్నారు. -
సివిల్స్ ప్రథమ ర్యాంకర్ నందినికి సన్మానం
కాశీబుగ్గ : ఆల్ ఇండియా సివిల్స్ ప్రథమ ర్యాంకర్, కేరళకు చెందిన నందినికి పలాసలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలి టీ పరిధిలో పారసాంబ గ్రామానికి యువ ఐఏఎస్‌లు మంగళవారం రాత్రి చేరుకున్నారు. మంగళవారం గ్రామంలో బస చేసిన ఆమెకు స్థానికులు, పట్టణ వాసులు, రోణంకి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపి శాలువతో సత్కరించారు. ఇటీవల ఐఏఎస్ అధికారులుగా ఎంపికైన 19మంది ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పశ్చిమబెంగాల్ నుంచి విశాఖ నేవల్ డాక్‌యార్డుకు చేరుకుంటున్న సమయంలో మార్గమధ్యం లో పలాస వచ్చారు. ఐఏఎస్ శిక్షణలో భాగంగా భారత దర్శిని పేరుతో అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ జాతీయ రహదారిపై వెళ్తున్న ఈ బృందాన్ని సివిల్స్ 3వర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ ఆ హ్వానించడంతో ఆయన ఇంటికి చేరుకుని బస చేశారు. ఆరుబయట నేలపై కూర్చుని భోజన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో మిగిలిన ఐఏ ఎస్ అధికారులు, టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, రోణంకి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్ లో సత్తా చాటిన ఎమ్మెల్యే కొడుకు
పట్నా: బిహార్ అధికార పార్టీ జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు హత్య కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిస్తే, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు తన ప్రతిభతో పతాక శీర్షికలకు ఎక్కాడు. జేడీ(యూ) ఎమ్మెల్యే వీరేంద్ర కుమార్ సింగ్ కుమారుడు డాక్టర్ వివేక్ కుమార్ సివిల్స్ లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 80వ ర్యాంకు సాధించాడు. తన కుమారుడు సివిల్స్ ర్యాంక్ సాధించడం పట్ల వీరేంద్ర కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 'కొడుకు తన కంటే బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. నా కుమారుడు సాధించిన విజయాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. చాలా గర్వంగా ఉంద'ని పేర్కొన్నారు. వివేక్ ఐఏఎస్ సాధిస్తాడని అసలు ఊహించలేదని చెప్పారు. 2010లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాతే అతడిపై నమ్మకం కుదిరిందని వెల్లడించారు. మూడో ప్రయత్నంలో అతడు సివిల్స్ ర్యాంకు సాధించాడని తెలిపారు. 'అమెరికా వెళ్లి ఎండీ చేయాలనుకున్నాడు. వీసా రావడం ఆలస్యం కావడంతో ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతానని చెప్పాడు. చాలా కష్టపడాల్సి ఉంటుందని అనగా, అన్నింటికీ సిద్ధమే అన్నాడు. వివేక్ దినచర్య భిన్నంగా ఉండేది. రాత్రిళ్లు చదువుకుని పగలంతా నిద్రపోయే వాడు. ఆరోగ్యం గురించి పట్టించుకునే వాడు కాదు. టైమ్ కు తినమని పదేపదే చెప్పేవాడిని' అని పేర్కొన్నారు. రెండుసార్లు విఫలమైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో సివిల్స్ ర్యాంక్ సాధించానని వివేక్ తెలిపాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని సఫ్తార్ గంజ్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. -
పశువులకాపరి సివిల్స్ సాధించింది
చెన్నై: మంచి బట్టలు, చెప్పులు లేనిదే నలుగురితో కలవలేని పరిస్థితి నేటి విద్యార్థులది. వన్మతి మాత్రం అవేవీ ఆలోచించదు. స్కూలుకు పోయేటప్పుడు బర్రెను తోలుకెళ్లి పచ్చిక బైళ్లలో వదిలేస్తుంది. మళ్లీ వచ్చేటప్పుడు వెంటబెట్టుకొస్తుంది. ఇంటర్, డిగ్రీల్లోనూ తన దినచర్య మారలేదు. 'ఎదిగిన అమ్మాయివి.. గేదెను తోలుకెళ్లడం నామోషీగాలేదూ..' అని కొందరనేవాళ్లు. వన్మతి మాత్రం తన లక్ష్యాన్ని తప్ప మరిదేనినీ లక్ష్యపెట్టేదికాదు. అలా ఏళ్లుగా ఊరిస్తోన్న ఐఏఎస్ కల నిన్నటి యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల ద్వారా నెరవేరింది. ఆలిండియా 152వ ర్యాంకు సాధించింది. వన్మతిది తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం. తండ్రి చెన్నియప్పన్ అద్దె ట్యాక్సీ నడుపుతాడు. తల్లి సుబ్బులక్ష్మీ చిన్నచిన్న పనులు చేసేది. నిజానికి గాసం పోను వన్మతిని ఉన్నత చదువులు చదివించే స్థోమతలేదు ఆ తల్లిదండ్రులకు. అందుకే అమ్మాయి పేరుమీద ఓ బర్రెను కొని, దాని పాలు అమ్మగా విచ్చిన డబ్బుతో వన్మతిని చదివించారు. బర్రె ఆలనాపాలనా వన్మతే చూసుకునేది. ఇప్పటికీ చూసుకుంటోంది. 'సివిల్స్ సాధించడం నా కల. 2011లో మొదటిసారి ట్రై చేశా. ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమయ్యా. రెండోసారి కనీసం ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేదు. మూడోసారి, అంటే 2013లో మెయిన్స్ తప్పా. 2014లో మాత్రం తీవ్రంగా శ్రమించా. 152వ ర్యాంక్ సాధించా. ఇక నా కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుందనే ఫీలింగ్ అన్నింటికన్నా ఎక్కువ ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే నన్ను చదివించడానికి మావాళ్లు పడ్డ కష్టం అంతాఇంతాకాదు. మా నాన్న స్నేహితుడు బాలసుబ్రహ్మణియన్ అంకుల్ ప్రోత్సాహం కూడా మరువలేనిది. ఇప్పటికీ బర్రెలు కాయడం నాకు చాలా ఇష్టమైనపని. దాన్ని ఆదాయవనరుగా కాకుండా కుటుంబ సభ్యురాలిగా భావిస్తాం. రేప్పొద్దున నేను కలెక్టర్ అయ్యాక బాధపడేది ఏదైనా ఉంటే బహుషా ఇదే అవుతుందేమో' అంటోంది వన్మతి. బీఎస్సీ కంప్యూటర్ టెక్నాలజీలో డిగ్రీచేసిన ఆమె డిస్టెన్స్‌లో ఎంబీఏ కూడా పూర్తిచేసింది. ప్రస్తుతం ఐఏఎస్ ట్రైనింగ్ కాల్ లెటర్ కోసం ఎదురుచూస్తోంది.