కింద నీటిలో చూస్తూ ధనుస్సుతోపైన మత్స్యయంత్రాన్ని కొడతాడు అర్జునుడు!నాలుగు చినుకులు పడితే నీట మునిగేఇంటిలో ఉంటూ సివిల్స్‌లో ర్యాంక్ కొట్టింది శ్రీధన్య. పేదరికాన్ని ఈదేందుకు చదువును లైఫ్‌బోట్‌గా చేసుకున్న ఈ అమ్మాయి ఒక కష్టం పడలేదు. అలాగని ఇష్టమైన కలను కనడమూ మానలేదు!
‘‘సాధారణంగా వరదలు అంటే అందరూ భయపడతారు. అయితే మాకు వరదలు చాలా సాధారణం. ఒకవిధంగా చెప్పాలంటే వానాకాలంలో నిత్యం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చునే తిథుల్లాంటివి’’ అంటారు శ్రీధన్య తల్లి కమల. శ్రీధన్య కేరళలో ఆదివాసీ తెగ నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన మొట్టమొదటి విద్యార్థిని. ‘‘మా అమ్మాయి చదువుకునే పుస్తకాలు కనీసం రెండు సంచులైనా గత ఏడాది వచ్చిన వరదల్లో కొట్టుకుపోయాయి. అయినా సరే.. ఆమె జీవితాశయాన్ని, సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్న ఆమె ఆశను అవి ఆపలేకపోయాయి’’ అని కమల కొద్దిపాటి గర్వంతో కూడిన సంతోషంతో చెబుతారు. గత ఆగస్ట్‌లో కేరళలో సంభవించిన వరదలు ఈ శతాబ్దిలోనే అత్యంత భయంకరమైనవిగా పేరు పొందాయి. ఈ వరద బీభత్సం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో బాటు వీరుండే ఇడియమ్‌వాయల్‌నూ కుదిపి వేసింది. గాలీవానా, దానికితోడు వరద తాకిడికి జనజీవనం అతలాకుతలమైంది.
ఈ వరదల గురించి అడిగినప్పుడు కమల ముఖంలో కొద్దిపాటి విచారం ప్రస్ఫుటమయింది. ‘‘వరదలు మాకు కొత్తేమీ కాదు. ఇంచుమించు ప్రతి రుతువులోనూ వస్తుంటాయి. మా ఇంటి కప్పులు కారకుండా ప్లాస్టిక్ సామాను అడ్డుపెట్టడం తప్ప మరేమీ తేడా లేదు’’ అన్నారావిడ నిర్లిప్తంగా నవ్వుతూ. కేరళలోని ఒక వెనుకబడిన జిల్లాలో, అదీ ఆదివాసీలు అధికంగా కనిపించే ఓ కుగ్రామంలో వరదల గురించి ఇటువంటి మాటలు వినరావడం మామూలే. అయితే కమల ఈ మాటలు చెప్పారంటే, కచ్చితంగా ఆలోచించి తీరాల్సిందే. ఎందుకంటే, ఆమె సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణత సాధించిన మొట్టమొదటి విద్యార్థిని శ్రీధన్య తల్లి కాబట్టి. సివిల్ సర్వీస్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా సెలక్టయిన 759 పేర్లు ఉన్న జాబితాలో శ్రీధన్యది నాలుగు వందల పదవ ర్యాంకు. చినుకు పడితే కప్పునుంచి నీళ్లు కారి, చిత్తడి చిత్తడి అయ్యే ఇంటిలో ఉండే శ్రీధన్య ఈ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైందని తెలిస్తే మాత్రం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆమె తలిదండ్రులిద్దరూ రోజు కూలీలే, రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులే కావడం వల్ల తమ ముగ్గురు పిల్లలూ చాలీ చాలని గుడ్డిదీపపు వెలుగులో కళ్లు చికిలించి మరీ చదువుకుంటుంటే వారిని బాధతో చూడటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయులు వారు.
ఆ పాటి గుడ్డిదీపాలు కూడా నాలుగైదేళ్ల నుంచే ఆ ఇంటిలో వెలుగుతున్నాయి. అంతకుముందు ఆముదం దీపాలే ఆ ఇంటి చీకట్లను పారద్రోలడానికి విశ్వప్రయత్నం చేసేవి. ఆ ఇంటిలోనే పాత చీరలు, ఉన్ని ఉండలే గోడలుగా పార్టిషన్ చేసుకుని దానిని తన గదిగా మార్చుకుంది శ్రీధన్య. అందులోనే ఆమె చదువు. బాల్యంలో కూడా శ్రీధన్య, ఆమె అక్క, తమ్ముడు ముగ్గురూ కాలినడకనే బడికి వెళ్లేవారు. దాదాపు 4 కిలోమీటర్లకు పైగా నడిచి మరీ స్కూలుకి చేరుకునేవారు. టెంత్ క్లాస్ వరకూ ఆ స్కూల్‌లోనే చదివిన శ్రీధన్య.. ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నీ కూడా తన ప్రతిభతో ఉచితంగా చదువుకోగలిగింది. ‘‘ఒక్క శ్రీధన్యే కాదు, మా పిల్లలందరినీ కూడా సరస్వతీ దేవి చల్లగా చూసింది. చదువులో వాళ్లు తెచ్చుకున్న మార్కులే వాళ్లకి స్కాలర్‌షిప్‌లు సంపాదించి పెట్టేవి. వాటితోనే మా కుటుంబం నాలుగు మెతుకులు తినగలిగింది. నిజానికి మా పిల్లలని చెప్పుకోవడం కాదు గానీ, వాళ్లని చదివించడానికి మేము చేసిందేమీ లేదండీ, వాళ్లే కష్టపడి చదువుకున్నారు’’ అన్నారు శ్రీధన్య తండ్రి సురేశ్.
‘‘కాలేజీకి పంపించేందుకు నా దగ్గర పైసా కూడా డబ్బులేనివాడిని. ఇక నేను తనకి ల్యాప్‌టాప్ ఏమి కొనిపెడతాను? అది కూడా శ్రీధన్యే తన స్కాలర్ షిప్పుతోనే కొనుక్కుంది. కోళికోడ్‌లోని దేవగిరి కాలేజీలో చేరి, హాస్టల్ ఫీజు, మెస్సు బిల్లులు కూడా తనే కట్టుకుంది. ఈ ర్యాంకు సాధించిందంటే అంతా ఆమె కష్టమే. అసలు ఇప్పుడు తన రిజల్ట్ వచ్చాక అభినందనలకు ప్రతిస్పందనగా నమస్కరించాలన్నా ఆమె చేతులు సహకరించడం లేదు. ఎందుకంటే, ఆమె తన ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో షాక్ కొట్టింది. మోచేతి దాకా కాస్త బలహీనపడింది’’ అంటూ కంటతడి పెట్టుకున్నారు సురేష్. ఇక శ్రీధన్య తమ్ముడు విశాల్.. ‘‘ఎన్ని కష్టాలున్నా వాటినుంచి బయటపడటం ఎలాగో తనను చూసే నేర్చుకున్నాను’’ అంటాడు. ‘‘తను ఎంత సున్నిత మనస్కురాలంటే, తనకు ఎంత ఇబ్బంది ఉన్నా గానీ, మేము బాధపడతామని నోరు విప్పి చెప్పుకోలేదెప్పుడూ. అంతేకాదు, తను ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది’’ అంటాడు.కురిచ్య తెగ సంప్రదాయం ప్రకారం శ్రీధన్య ఇంటి ముందు విల్లు, బాణాలు ఎక్కుపెట్టి ఉంటాయి. ఆ సమీపంలోనే స్ఫూర్తి కోసం టార్గెట్ బోర్డ్ అమర్చుకుంది శ్రీధన్య. చివరికి తన లక్ష్యాన్ని సాధించింది
కృష్ణ కార్తీక
కల నిజమైంది
కనిష్క్ కటారియా, శ్రుతి జయంత్ దేశ్‌ముఖ్.. ఈ ఇద్దరు గత ఐదురోజులుగా వార్తపత్రికల్లో, టీవీల్లో కనిపిస్తున్నారు. యూపీఎస్సీ గత శుక్రవారం ప్రకటించిన 2018 సివిల్ సర్వీసు ఫలితాలలో కనిష్క్, శ్రుతి టాపర్‌లుగా నిలిచారు. అయితే వీళ్లకంటే ఎక్కువగా ఒక నిరుపేద ఆదివాసీ ప్రతిభామూర్తి గురించి విద్యార్థిలోకం చెప్పుకుంటోంది. ఆ ప్రతిభామూర్తి పేరు శ్రీధన్య. సివిల్స్‌లో 410 ర్యాంకు సాధించి కేరళలోని ఆదివాసీ తెగ నుంచి తొలిసారి ఇలాంటి ఒక విజయాన్ని సాధించిన యువతిగా శ్రీధన్య పేరు మారుమోగిపోతోంది. శ్రీధన్యది వేయనాడ్ జిల్లాలోని ఉడియంవయాల్ గ్రామం. కురిచ్య తెగ. శ్రీధన్యకు ర్యాంకు వచ్చిందని తెలియగానే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెను అభినందించారు. ‘‘సామాజిక పరిస్థితులతో పోరాడి సివిల్స్‌లో అతి పెద్ద విజయాన్ని సాధించిన శ్రీధన్యకు అభినందనలు’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. కేరళ ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి కె.కె. శైలజ.. ‘‘వేయనాడ్ ప్రజలకు ఇదొక చరిత్రాత్మక క్షణం.
కేరళ చరిత్రలోనే తొలిసారిగా ఒక ఆదివాసీ అమ్మాయి సివిల్స్‌లో విజయం సాధించింది’’ అని ప్రశంసించారు. 25 ఏళ్ల శ్రీధన్య సాధించిన ఈ ఘనతకు అందరికన్నా ఎక్కువగా సంతోషిస్తున్నది మాత్రం ఆమె కుటుంబ సభ్యులే. మూడో ప్రయత్నంగా ఆమె ఈ విజయాన్ని సాధించారు. దినసరి కూలీ కుమార్తె అయిన శ్రీధన్య అప్లయిడ్ జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సివిల్స్ మెయిన్స్‌లో మలయాళ సాహిత్యాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. ర్యాంకుతో తనకు గుర్తింపు రావడంపై మాట్లాడుతూ, తమ తెగలోని మిగతా అమ్మాయిలకు ఈ విజయం ఒక స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. 2016లో పీజీ పూర్తయ్యాక, శ్రీధన్య రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో ప్రాజెక్టు అసిస్టెంటుగా పని చేశారు. అప్పుడే ఆమె∙సివిల్స్ వైపు మొగ్గచూపారు. నిజానికి అది ఆమె కల కూడా. ఆ కలను మొత్తానికి నిజం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment