పట్టుదల ఉంటే.. కోచింగ్ అక్కర్లే | Civils 94th Ranker Avula Saikrishna Interview | Sakshi
Sakshi News home page

పట్టుదల ఉంటే.. కోచింగ్ అక్కర్లే

Published Sun, May 28 2023 1:12 PM | Last Updated on Sun, May 28 2023 1:12 PM

Civils 94th Ranker Avula Saikrishna Interview - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ‘ప్రస్తుత ఇంటర్నెట్‌ యుగంలో పేద, ధనిక తేడాలేదు. ప్రతిభ ఉన్న ఎవరైనా కల నెరవేర్చుకోవచ్చు. ఏ పోటీపరీక్షకైనా ఆన్‌లైన్‌లో బోలెడు కంటెంట్, మెటీరియల్‌ ఉంది. ప్రణాళిక, పట్టుదల ఉంటే కోచింగ్‌ అక్కర్లేదు. దినపత్రికలు చదవాలి. నోట్స్‌ తయారు చేసుకోవాలి. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి.’ అని సివిల్స్‌ విజేత సాయికృష్ణ అన్నారు. కరీంనగర్‌కు తొలిసారిగా వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. 
ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

లక్ష్యసాధనకు ఏడేళ్ల తపస్సు
సివిల్స్‌ నా చిన్ననాటి కల. దాని కోసం ఏడేళ్లు తపస్సు చేశా. నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. సివిల్స్‌లో 94వ ర్యాంక్‌ రావడం ఆనందంగా ఉంది. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు జిల్లాకు కలెక్టర్‌గా సుమితా డావ్రా వచ్చారు. ఆమె గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విని స్ఫూర్తి పొందాను. కరీంనగర్‌పై ఆమె రాసిన ‘పూర్‌ బట్‌ స్పిరిటెడ్‌ కరీంనగర్‌’ పుస్తకం నాకు ప్రేరణనిచి్చంది.

ఆన్‌లైన్‌లో  మెటీరియల్‌ ఎక్కువే..
ఇంటర్నెట్లో అన్ని పరీక్షల మెటీరియల్‌ దొరుకుతుంది.ఆ మెటీరియల్‌ సివిల్స్‌ ప్రిపేర్‌ అయ్యే వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంగ్లిష్‌ వస్తేనే సివిల్స్‌ సాధిస్తామనే అపోహను వీడాలి. మన మాతృభాషలో కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ సైతం మాతృభాషలోనే నిర్వహిస్తారు. కోచింగ్‌ తీసుకోవాలనే అపోహ, ఇంగ్లిష్‌ రాదనే భయం వీడితే ఎవరైన సివిల్స్‌ సాధించవచ్చు.

కుటుంబమే పెద్ద అండ
సివిల్స్‌ ప్రిపరేషన్‌లో కుటుంబ ం అండగా నిలిచింది. నాన్న, మామయ్యలు, అత్తయ్యలు ఎనిమిది మంది వరకు ప్రభుత్వ టీచర్లే.వారి ద్వారా స్ఫూర్తి పొందేవా డిని. 2015లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం వస్తే చేరకున్నా ఎవరూ ఏమీ అనలేదు.ఇంటికే పేపర్‌ వస్తుండడంతో చిన్నప్పటి నుంచే దినపత్రికలు చదవడం అలవాటుగా మారింది. ఈ అలవాటు సివిల్స్‌కు ఎంతో ఉపయోగపడింది.

సొంతంగా నోట్స్‌  తయారు చేసుకున్నా..
వరంగల్‌ ఎన్‌ఐటీలో 2015లో బీటెక్‌ పూర్తయ్యింది. ఢిల్లీకి వెళ్లి సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్న. సొంతంగా నోట్స్‌ త యారు చేసుకున్న. 2017 సివిల్స్‌లో 728వ ర్యా ంకుతో ఐసీఎల్‌ఎస్‌ వచ్చింది. నా లక్ష్యం ఐఏఎస్‌ కావడంతో మళ్లీ ప్రిపేర్‌ అయ్యాను. రోజుకు 5 నుంచి 7 గంటలు చదివాను. ఈ క్రమంలో మా సీనియర్‌ తక్కల్లపల్లి యశ్వంత్‌రావు ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి.

సోషల్‌ మీడియాకు దూరం
సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నాను. కంటెంట్‌ కోసమే ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశాను. లక్ష్య సాధనకు అవసరమైన సమాచారం కోసమే యూ ట్యూబ్, గూగుల్‌లో సెర్చ్‌ చేశాను. అది నాకు ఎంతగానో ఉపయోగపడింది. అప్పుడప్పుడు సినిమాలు కూడా చూశాను. కానీ పరిమితంగానే చూశాను. ఈ కాలం తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాల దశలోనే ఐఏఎస్, ఐఐటీ కోర్సులు అంటూ నేర్పిస్తున్నారు. ఇది కొంత ఇబ్బందికరమే. పాఠశాల, ఇంటర్‌ స్థాయిలో ఐఐటీ, ఐఏఎస్‌ కోచింగ్‌లు ఇప్పించడం సరికాదు. ప్రతీ విద్యార్థి తనకంటూ ప్రత్యేకమైన టాలెంట్‌ ఉంటుంది. అది తెలుసుకొని అటువైపు వెళ్తే సక్సెస్‌ అవుతారు. అయితే కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌ తెలుసుకోవడం ప్రతీ విద్యార్థికి అవసరమే. ఏ పోటీ పరీక్షలోనైన కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు ఉంటేనే రాణించగలుగుతారు.

తన కలనే మా కల
సాయి చిన్నప్పటి నుంచే ఐఏఎస్‌ కావాలని లక్ష్యంగా పెరిగాడు. అందుకోసం నిరంతరం శ్రమించాడు. తన కలను మా కలగానే అనుకుని అన్ని విధాలా సహకరించాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతను అడిగినవన్నీ సమకూర్చాం. 2017లోనే ఐసీఎల్‌ఎస్‌ వచ్చినా సంతృప్తి చెందలేదు. తన స్వప్నం సాకారం కోసం రాత్రింబవళ్లు శ్రమించాడు. చివరికి సాధించాడు.
–  ఆవుల లక్ష్మయ్య

ప్రైవేటు ఉద్యోగాన్ని వదులుకున్నాడు
2015లోనే నా కుమారుడు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో సెలెక్టయ్యాడు. తల్లిదండ్రులుగా మేమెంతో ఆనందపడ్డాం. ఆకర్షణీయమైన ప్యాకేజీ చేతికి అందినా పక్కనబెట్టాడు. తన కలల వైపు అడుగులేశాడు. చివరికి నా కొడుకు తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ రోజు ఇంకా సంతోషిస్తున్నాం.  
– ఆవుల సునీత  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement