సివిల్స్ లో సత్తా చాటిన ఎమ్మెల్యే కొడుకు
పట్నా: బిహార్ అధికార పార్టీ జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు హత్య కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిస్తే, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు తన ప్రతిభతో పతాక శీర్షికలకు ఎక్కాడు. జేడీ(యూ) ఎమ్మెల్యే వీరేంద్ర కుమార్ సింగ్ కుమారుడు డాక్టర్ వివేక్ కుమార్ సివిల్స్ లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 80వ ర్యాంకు సాధించాడు.
తన కుమారుడు సివిల్స్ ర్యాంక్ సాధించడం పట్ల వీరేంద్ర కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 'కొడుకు తన కంటే బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. నా కుమారుడు సాధించిన విజయాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. చాలా గర్వంగా ఉంద'ని పేర్కొన్నారు. వివేక్ ఐఏఎస్ సాధిస్తాడని అసలు ఊహించలేదని చెప్పారు. 2010లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాతే అతడిపై నమ్మకం కుదిరిందని వెల్లడించారు. మూడో ప్రయత్నంలో అతడు సివిల్స్ ర్యాంకు సాధించాడని తెలిపారు.
'అమెరికా వెళ్లి ఎండీ చేయాలనుకున్నాడు. వీసా రావడం ఆలస్యం కావడంతో ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతానని చెప్పాడు. చాలా కష్టపడాల్సి ఉంటుందని అనగా, అన్నింటికీ సిద్ధమే అన్నాడు. వివేక్ దినచర్య భిన్నంగా ఉండేది. రాత్రిళ్లు చదువుకుని పగలంతా నిద్రపోయే వాడు. ఆరోగ్యం గురించి పట్టించుకునే వాడు కాదు. టైమ్ కు తినమని పదేపదే చెప్పేవాడిని' అని పేర్కొన్నారు. రెండుసార్లు విఫలమైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో సివిల్స్ ర్యాంక్ సాధించానని వివేక్ తెలిపాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని సఫ్తార్ గంజ్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు.