JD(U) MLA
-
హత్య కేసులో దోషిగా తేలిన రాకీ యాదవ్
న్యూఢిల్లీః ఓ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన కేసులో సస్పెండ్ అయిన జేడీ(యూ) ఎంఎల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్‌ను బీహార్ కోర్టు దోషిగా నిర్దారించింది.గయాలో 2016, మే 7న తన వాహనాన్ని ఓవర్టేక్ చేసినందుకు ఇంటర్ విద్యార్థి ఆదిత్య సచ్దేవ్ను రాకీ యాదవ్ హత్య చేసినట్టు కోర్టు నిర్ధారణకు వచ్చినట్టు తీర్పును వెలువరిస్తూ సెషన్స్ జడ్జి సచిదానంద్ సింగ్ చెప్పారు. సెప్టెంబర్ 6న రాకీ యాదవ్‌కు శిక్ష ఖరారు చేయనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. గత 15 నెలలుగా ఈ కేసులో పలు మలుపులు చోటుచేసుకున్నాయి. రాకీకి అప్పటి పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్బాల్ అహ్మద్ అన్సారీ గత అక్టోబర్‌లో బెయిల్ మంజూరు చేయగా, సుప్రీం కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులైన ఆదిత్య స్నేహితులు నలుగురు భిన్నంగా స్పందించడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు మధ్యలో మారిపోవడం వంటి అవరోధాలు ఎదురయ్యాయి. మరోవైపు రాకీ తండ్రి ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దింపడంతో ప్రాసిక్యూషన్ చివరికి శాస్త్రీయ ఆధారాలపైనే కేసులో నెగ్గుకొచ్చింది. ఘటన సమయంలో రాకీ మొబైల్ నెంబర్ అదే ప్రాంతంలో ఉన్నట్టు టవర్ లొకేషన్లో వెల్లడి కావడం, రాకీ తుపాకీ ఫోరెన్సిక్ పరీక్షలో బుల్లెట్లను ప్రయోగించినట్టు నిర్ధారించడంతో హత్య కేసులో రాకీ పాత్ర నిగ్గుతేలింది. -
సివిల్స్ లో సత్తా చాటిన ఎమ్మెల్యే కొడుకు
పట్నా: బిహార్ అధికార పార్టీ జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు హత్య కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిస్తే, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు తన ప్రతిభతో పతాక శీర్షికలకు ఎక్కాడు. జేడీ(యూ) ఎమ్మెల్యే వీరేంద్ర కుమార్ సింగ్ కుమారుడు డాక్టర్ వివేక్ కుమార్ సివిల్స్ లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 80వ ర్యాంకు సాధించాడు. తన కుమారుడు సివిల్స్ ర్యాంక్ సాధించడం పట్ల వీరేంద్ర కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 'కొడుకు తన కంటే బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. నా కుమారుడు సాధించిన విజయాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. చాలా గర్వంగా ఉంద'ని పేర్కొన్నారు. వివేక్ ఐఏఎస్ సాధిస్తాడని అసలు ఊహించలేదని చెప్పారు. 2010లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాతే అతడిపై నమ్మకం కుదిరిందని వెల్లడించారు. మూడో ప్రయత్నంలో అతడు సివిల్స్ ర్యాంకు సాధించాడని తెలిపారు. 'అమెరికా వెళ్లి ఎండీ చేయాలనుకున్నాడు. వీసా రావడం ఆలస్యం కావడంతో ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతానని చెప్పాడు. చాలా కష్టపడాల్సి ఉంటుందని అనగా, అన్నింటికీ సిద్ధమే అన్నాడు. వివేక్ దినచర్య భిన్నంగా ఉండేది. రాత్రిళ్లు చదువుకుని పగలంతా నిద్రపోయే వాడు. ఆరోగ్యం గురించి పట్టించుకునే వాడు కాదు. టైమ్ కు తినమని పదేపదే చెప్పేవాడిని' అని పేర్కొన్నారు. రెండుసార్లు విఫలమైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో సివిల్స్ ర్యాంక్ సాధించానని వివేక్ తెలిపాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని సఫ్తార్ గంజ్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. -
'మావాళ్ల జోలికొస్తే నాలుక చీరేస్తా'
పాట్నా: బిహార్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్.. బాలికపై అత్యాచారానికి తెబగడి పారిపోగా తాజాగా జేడీ(యూ) ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తన మద్దతుదారుల జోలికివస్తే నాలుక చీరేస్తానంటూ భగల్పూర్ జిల్లా గోపాల్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ హెచ్చరించారు. నావగాచియా బజార్ ప్రాంతంలో ఆదివారం క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'మా వాళ్లను ఎవరైనా బెదిరిస్తే వాళ్ల నాలుకలు చీరేస్తా. నా రెండు కాళ్లలో ఒకటి జైలులో, మరొకటి బయట ఉంటుంది. ముందు నేను గోపాల్ మండల్ ని, తర్వాతే ఎమ్మెల్యేని. సమాజంలో నాకో స్టేటస్ ఉంద'ని పేర్కొన్నారు. గోపాల్ మండల్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎమ్మెల్యేల వ్యవహార శైలి మహా కూటమి పాలనకు అద్దం పడుతోందని బీజేపీ నేత నంద కిశోర్ అన్నారు. గోపాల్ వ్యాఖ్యలపై స్పందించేందుకు సీఎం నితీశ్ కుమార్ నిరాకరించారు. గోపాల్ మండల్ కు వివాదాలు కొత్త కాదు. గతంలో తన కారును ఆపినందుకు డీఎస్పీ స్థాయి అధికారిపై దౌర్జన్యంగా ప్రవర్తించారు. తనను అవమానించాలని చూస్తే మోదీ ప్రభుత్వాన్నైనా, నితీశ్ సర్కారునైనా లెక్క చేయబోనని అన్నారు. -
'ఆ ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా'
పాట్నా: హత్యారోపణలు ఎదుర్కొంటున్న జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ ను అరెస్ట్ చేయించింది తానేనని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ అంగీకరించారు. తన ఒత్తిడి మేరకే పోలీసులు సింగ్ ను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. ' నేను ఒత్తిడి చేయడంతోనే సింగ్ ను అరెస్ట్ చేశారు. మీ చేతుల్లోంచి ఎవరైనా మీ బిడ్డను తీసుకుని పారిపోతే ఏం చేస్తారు. జర్నలిస్టుపై దాడి చేస్తే ఏం చేస్తారు. నేనూ అదే చేశాను. సింగ్ లాంటి వ్యక్తులు సమాజంలోని సామరస్యాన్ని చెడగొడతార'ని లాలు యాదవ్ అన్నారు. ఆర్జేడీ కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. అనంత్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన మద్దతుదారులు సాగిస్తున్న హింసాకాండ ఆమోయోగ్యం కాదన్నారు. ఇటువంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. కాగా, అనంత్ సింగ్ తో ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే ఆయనను లాలు అరెస్ట్ చేయించారన్న ఆరోపణలు వచ్చాయి.