హత్య కేసులో దోషిగా తేలిన రాకీ యాదవ్
హత్య కేసులో దోషిగా తేలిన రాకీ యాదవ్
Published Thu, Aug 31 2017 4:10 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM
న్యూఢిల్లీః ఓ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన కేసులో సస్పెండ్ అయిన జేడీ(యూ) ఎంఎల్‌సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్‌ను బీహార్ కోర్టు దోషిగా నిర్దారించింది.గయాలో 2016, మే 7న తన వాహనాన్ని ఓవర్‌టేక్ చేసినందుకు ఇంటర్ విద్యార్థి ఆదిత్య సచ్‌దేవ్‌ను రాకీ యాదవ్ హత్య చేసినట్టు కోర్టు నిర్ధారణకు వచ్చినట్టు తీర్పును వెలువరిస్తూ సెషన్స్ జడ్జి సచిదానంద్ సింగ్ చెప్పారు. సెప్టెంబర్ 6న రాకీ యాదవ్‌కు శిక్ష ఖరారు చేయనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. గత 15 నెలలుగా ఈ కేసులో పలు మలుపులు చోటుచేసుకున్నాయి.
రాకీకి అప్పటి పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్బాల్ అహ్మద్ అన్సారీ గత అక్టోబర్‌లో బెయిల్ మంజూరు చేయగా, సుప్రీం కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులైన ఆదిత్య స్నేహితులు నలుగురు భిన్నంగా స్పందించడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు మధ్యలో మారిపోవడం వంటి అవరోధాలు ఎదురయ్యాయి. మరోవైపు రాకీ తండ్రి ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దింపడంతో ప్రాసిక్యూషన్ చివరికి శాస్త్రీయ ఆధారాలపైనే కేసులో నెగ్గుకొచ్చింది.
ఘటన సమయంలో రాకీ మొబైల్ నెంబర్ అదే ప్రాంతంలో ఉన్నట్టు టవర్ లొకేషన్‌లో వెల్లడి కావడం, రాకీ తుపాకీ ఫోరెన్సిక్ పరీక్షలో బుల్లెట్లను ప్రయోగించినట్టు నిర్ధారించడంతో హత్య కేసులో రాకీ పాత్ర నిగ్గుతేలింది.
Advertisement
Advertisement