నిప్పులాంటి ఐదుగురు అధికారులు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాధారణంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించకుంటాం. నేడు స్వతంత్ర భారతంలో పెరిగిపోతున్న అవినీతిని అంటరానితనంగా భావించి దాన్ని తమ దరిదాపుల్లోని రానియ్యని అధికారుల గురించి, రాజకీయ పెద్దల ఒత్తిళ్లు, వేధింపులను, బెదిరింపులను, బదిలీలను తట్టుకొని అవినీతిపై పోరు సాగించిన, సాగిస్తున్న సివిల్స్ అధికారుల గురించి గుర్తు చేసుకోవడం బహు అరుదు. అలాంటి కోవకు చెందిన వారి గురించి క్లుప్తంగా..
పూనం మాలకొండయ్య, ఆంధ్రప్రదేశ్: 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. సమాజంలో వేళ్లూనుకున్న ఆశ్రిత పక్షపాతాన్ని, జాతి దురహంకారం, నిర్లిప్తతా ధోరణులకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఆరేళ్లలో ఏడుసార్లు బదిలీ అయ్యారు. వ్యవసాయ రంగం నుంచి రవాణా, అటు నుంచి విద్య, అక్కడినుంచి పౌర సరఫరాలు.. ఇలా ఎన్ని విభాగాలు మారినా ఏ రంగంలోనూ రాజీ పడని మనస్తత్వం ఆమెది. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా మోన్శాంటో లాంటి బహుళజాతి కంపెనీల మెడలు వంచి బీటీ కాటన్ విత్తనాల ధరలు తగ్గించిన ఘనత ఆమెది.
మనోజ్ నాథ్, బిహార్: తన 20వ ఏటనే ఐపీఎస్ పరీక్ష రాసి దేశంలో మూడోర్యాంక్ సాధించారు. 1973లో బిహార్ నుంచి తొలి ర్యాంక్‌ను సాధించారు. 39 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా సేవలందించిన ఆయన 2012లో పదవీ విరమణ చేశారు. నిజాయితీకి నిలువుటద్దంలా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల 40 సార్లు బదిలీ అయ్యారు. ఎన్నో అర్హతలు ఉన్నా డీజీపీ లాంటి పదవులకు ఆయన పేరును ఎప్పుడూ పరిశీలించలేదు. ఆయన కన్నా ఎంతో మంది జూనియర్లు ఆయనను దాటేసి ఉన్నత పదవులను అధిష్ఠించారు. బొకారో ఎస్పీగా పనిచేసినప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అవినీతి కేసులో బొకారో స్టీల్ ప్లాంట్ ఎండీని అరెస్టుచేశారు. పర్యవసానంగా 24 గంటల్లోనే బదిలీ అయ్యారు.
జీఆర్ ఖైర్నార్, మహారాష్ట్ర: గోవింద్ రఘో ఖైర్నార్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఆయనది ఎవరికీ భయపడే తత్వం కాదు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా నగరంలో దురాక్రమణలను తొలగించారు. అక్రమ కట్టడాలను కూల్చారు. ఎన్నో ప్రభుత్వ స్థలాలను రక్షించారు. ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం జరిపారు. వారి చేతుల్లో గాయపడ్డారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నందుకు ఒకసారి సస్పెండ్ అయ్యారు. ఉన్నతాధికారుల మాటలు వినడం లేదన్న ఆరోపణలపై ఆయనపై కేసు దాఖలుచేశారు. చివరకు ముంబై కోర్టులో ఆయన కేసు గెలిచారు. ఆయనకు కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. 'వన్ మేన్ డెమోలిషన్ ఆర్మీ'గా ముంబై ప్రజలు ఆయన్ని కీర్తించారు. ఆయన తన సస్పెన్షన్ కాలంలో మరాఠీలో 'ఏకాకి జూంజ్ (ఒంటరి పోరాటం)' శీర్షికన తన ఆత్మకథను రాశారు.
సమిత్ శర్మ, రాజస్థాన్: రాష్ట్రంలోని చిత్తూర్‌గఢ్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 2009లో ప్రభుత్వం ఆయన్ని అన్యాయంగా బదిలీ చేసినందుకు నిరసనగా 12 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు పెట్టి సమ్మెచేశారు. అయినా రాజకీయ పెద్దలు ఆయన బదిలీని వెనక్కి తీసుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒకరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చినప్పుడు కిందిస్థాయి డివిజనల్ గుమాస్తా లేచి నమస్కారం పెట్టనందుకు అతన్ని ఉద్యోగం నుంచి తీసేయాలని సదరు ఎమ్మెల్యే శర్మపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన నిరాకరించడంతో బదిలీ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ కాకముందు డాక్టర్‌గా ఐదేళ్లు ప్రాక్టీస్ చేసిన శర్మ తన అనుభవాన్ని ఉపయోగించి రాజస్థాన్ పేద ప్రజలకు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జనరిక్ మెడిసన్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.
రజనీ సెక్రి సిబల్, హర్యానా: ఈ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి. ధైర్యానికి మారుపేరు. 1999-2000 సంవత్సరంలో 3,200 మంది జూనియర్ బేసిక్ ట్రేనింగ్ (జేబీటీ) టీచర్ల నియామకాల మార్కుల జాబితాను మార్చాలని రాజకీయ నాయకుల నుంచి ఆమెపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. అందుకు కోట్లాది రూపాయలను లంచంగా కూడా ఇస్తామని రాజకీయ పెద్దలే ఆశ చూపారు. అయినా ఆమె వినలేదు. అందుకని ఆమెను వెంటనే బదిలీ చేశారు. అసలు జాబితాను మార్చకుండా ఉండేందుకు ఆమె ఆ జాబితా ఉన్న బీరువాకు తాళం వేసి, నాలుగు అడుగుల గుడ్డతో బ్యాండేజీ చుట్టారు. పలుచోట్ల సీళ్లు అతికించారు. తన కింద పనిచేసే ఐదుగురు అధికారులతో వాటిపై సంతకాలు తీసుకున్నారు. తాళం చెవిని ఓ కవర్లో పెట్టి సీలు చేశారు. అయినా ఆమె బదిలీ అనంతరం ఈ టీచర్ల నియామకాల్లో అవినీతి చోటుచేసుకుంది. రజనీ కారణంగానే ఆ కుంభకోణం వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయడంతో ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురు వ్యక్తులు జైళ్ల పాలయ్యారు.
భారత సమాజంలో ఇలా నీతి, నిజాయితీలకు కట్టుబడి పనిచేస్తున్న వారు అక్కడక్కడైనా ఉండడం వల్ల ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇలాంటి వ్యక్తులను స్వాతంత్య్ర దినోత్సవరం రోజున సన్మానించకపోయినా ఫర్వాలేదు. గుర్తు చేసుకుంటే చాలు.