
'నాకు మా జయత్తను చూడాలని ఉంది'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను చూసేందుకు ఇప్పటి వరకు ఆమె వ్యక్తిగత బంధువులు వచ్చినట్లు ఎక్కడా వినిపించలేదు. అయితే, తొలిసారి, జయ మేన కోడలు అని చెప్పుకుంటూ దీపా జయకుమార్ అనే యువతి చెన్నైలోని అపోలో ఆస్పత్రి వద్దకు వచ్చింది. అయితే, ఆమెను కూడా జయను చూసేందుకు అనుమతించలేదు. దీంతో గేటు వద్ద పడిగాపులు గాస్తున్న ఆమె కాసేపు మీడియాతో మాట్లాడింది. తాను జయలలిత వదిన విజయలక్ష్మీ కూతురునని, జయ తనకు ప్రియమైన అత్తయ్య అని, తనను చాలా బాగా చూసుకుంటుందని మీడియాకు చెప్పింది. తన అత్తయ్య ఆరోగ్యం బాగ లేదని తాను మీడియా ద్వారా తెలుసుకున్నానని, దీంతో పరుగెత్తుకుంటూ వచ్చేశానని, అయితే, తనను చూడనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని చెప్పింది.
దీప ఇంగ్లిష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేట్ జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసింది. టీ నగర్ లో ఉంటున్న ఆమె మీడియా ద్వారా ఈ విషయం తెలిసిందని చెప్పింది. 'ఉన్నత స్థాయి అధికారులు నాకు ఫోన్ చేసి పిలుస్తానని అన్నారు. కానీ ఇప్పటి వరకు పిలవలేదు. మా అమ్మకు 2012లో చాలా సీరియస్ గా ఉన్న సమయంలో కూడా అధికారులు మా అత్తయ్యను(జయ) కలవకుండా చేశారు' అంటూ చెప్పుకొచ్చింది. జయలలిత సోదరుడు జయకుమార్ 1995లో చనిపోయినప్పుడు మాత్రమే జయ తమ ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్లిందని చెప్పింది. అసలు ఎందుకు ఇంత రహస్యంగా ఉంచుతున్నారో.. ఈ రహస్యాన్ని కొనసాగిస్తున్నవారెవరో దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.